ముదురుతున్న ఎండలు

జనం బేజార్‌
రాజకీయ ప్రచారానికి రామంటున్న ప్రజలు
ఉదయం,సాయంత్రం వేళల్లో మాత్రమే వస్తున్న కార్యకర్తలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): మార్చిలోనే సూర్యుడు మండిపోతున్న దశలో ఎన్నికల వేడి మరింతగా రగిలిస్తోంది. దీంతో ఎన్నికల ప్రచారానికి రావడానికి కార్యకర్తలు జంకుతున్నారు. ఎండల తీవ్రత అధికమవుతున్న కారణంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రచారంలో పాల్గొనేందుకు
వచ్చే కూలీలు అధిక డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ప్రచారానికి ఉదయం,సాయంత్రం వేళల్లో మాత్రమే వస్తామని అంటున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా ఉదయం, సాయంత్రం వేళ ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ ,నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.  వ్యాపారులు, ఉద్యోగులు, అన్ని వ ర్గాల ప్రజలు భానుడి ప్రతాపానికి బేజారువుతున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమవుతున్నది. మరోవైపు వడదెబ్బకు ఎక్కువగా పేదలే గురువుతున్నారు. పైగా వారిలో ఎక్కువ మంది ఆరుబయట కాయాకష్టం చేసే కార్మికులే. వడదెబ్బకు చనిపోయే వారిలో 40 – 60 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు. వారికి ఎండతీవ్రత నుంచి రక్షణ కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వడదెబ్బ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్యశాఖకు సూచించింది. వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలయ్యేవారికి అవసరమైన వైద్యం అందించాలని పేర్కొంది. ఈ ఏడాది వడగాడ్పులు అధికంగా ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించిన సంగతి విదితమే. తీవ్రమైన ఎండల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడం, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవడమే ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని వైద్యాధికారులు తెలిపారు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో శుభ్రతలేని నీళ్లు తాగడం వల్ల చాలా మంది అతిసార వ్యాధి బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో రోగులు ఆస్పత్రుల పాలవుతున్నారు. మరోవైపు, వేసవి తీవ్రత పెరుగుతుండడంతో రోగులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. నీళ్ల విరేచనాలు , డిసెంట్రీ, అ తిసారం, కామెర్లు, టైఫాయిడ్‌, అవిూబియాసిస్‌, విూజి ల్స్‌, చికెన్‌ఫాక్స్‌, శరీర నొప్పులు, తలనొప్పి, జలుబు, వైరల్‌ ఫీవర్‌, హై ఫీవర్‌, వాంతులు, గొంతునొప్పి, ద గ్గు, వ్యాధులతో ఆస్పత్రులకు వస్తున్నారు. ఆస్పత్రులకు వస్తున్న కేసుల్లో ఎక్కువగా విూజిల్స్‌, చికెన్‌ ఫాక్స్‌ కేసులు ఉంటున్నాయని వైద్యాధికారులు తెలిపారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంది.  వేసవిలో ఆహారాన్ని వం డి ఎక్కువసేపు నిల్వ ఉంచితే అందుతో బ్యాక్టీరియా చేరుతుంది. నిల్వ ఆహారాన్ని తినకుండా ఉంటేనే మేలు. పండ్లు, కూరగాయల ముక్కలను అప్పటికప్పుడు కోసుకొని తినాలి. గొంతు నొప్పి, విరేచనాలు, నుదురు వేడిగా ఉన్నా వైద్యున్ని సంప్రదించాలి. నీరు, గ్లూకోజ్‌, అంబలి, మజ్జిగ, పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రచారంలో ఎక్కువగా నెత్తికి గుడ్డలు కట్టుకోవాలని సూచిస్తున్నారు. మద్యాహ్నం ప్రచారం చేయకుండా కొందరు నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.