ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం 

ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం
యాదాద్రి భువనగిరి,మార్చి29(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వైటీడీఏ ఏడు రెవెన్యూ గ్రామాల పరిధిలో…. మొత్తం 104 చదరపు కిలోవిూటర్ల పరిధికి విస్తరిస్తుంది. యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి, సైదాపూర్‌, మల్లాపూర్‌, దాతార్‌పల్లి, బస్వాపూర్‌ రెవెన్యూ గ్రామాలను వైటీడీఏ పరిధిలో చేర్చారు. ఈ
మొత్తం పరిధిలో ఆధ్యాత్మిక చింతన కలిగేలా, సంస్కృతీసంప్రదాయాలను స్ఫురింపజేసేలా నిర్మాణాలు చేపడతారు. ఆలయక్షేత్రం అభివృద్ధి కోసం 1391 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. వైటీడీఏ పరిధిలో రెండు దశల్లో అభివృద్ధి  పనులు చేపట్టనున్నారు. అటవీ ప్రాంతం, గండి చెరువు, హిల్‌లాక్‌ ఏరియా, స్వామి వారి ఉద్యానవనం, కల్యాణమండపం, వీవీఐపీల కాటేజీలు వంటివి డ్రాఫ్టులో పొందుపర్చారు. యాదాద్రికి ఐదు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటుచేస్తారు. అన్నిచోట్లా శ్రీ లక్ష్మీనర్సింహస్వామి అవతారాలతో వీటిని నిర్మిస్తారు. మాసాయిపేట, వంగపల్లి, పాతగుట్ట ప్రాంతాల నుంచి ఇప్పటికే ఉన్న ప్రవేశ ద్వారాలను అభివృద్ధి చేస్తారు. వీటితో పాటు సిద్దిపేట, జాతీయ రహదారి 169 విూదుగా యాదాద్రికి చేరుకునే మార్గంలోనూ ముఖద్వారాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఐదు ముఖద్వారాలను పంచభూతాలుగా నామకరణం చేయనున్నారు. వైటీడీఏ పరిధిలో గురుకుల విద్యా సంస్థల సముదాయాలను కూడా చేర్చాలని అధికారులకు నవీన్‌మిట్టల్‌ సూచించారు. వైటీడీఏ పరిధిలోకి వచ్చే ఏడు రెవెన్యూ గ్రామాలను బహిరంగ విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వైటీడీఏ పరిధిలోని చెరువులను, పచ్చదనాన్ని అభివృద్ది చేయాలని బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని  సూచించారు.