మేటలు వేస్తున్న గోదావరి తీరం

నీరు రాక  రైతుల్లో ఆందోళన
ఏలూరు,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): ప్రస్తుతం గోదావరి పూర్తిగా ఎండిపోయి రైతులు రబీపంటకు సైతం సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటలను చివరి వరకు దక్కించుకునేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఉభయగోదావరి జిల్లాల్లో  సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవన్న నమ్మకాన్ని ఇప్పుడు గోదావరి తుడిచేసింది. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సుమారు 10.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, రెండు జిల్లాల్లో సగం మంది ప్రజలకు తాగునీరు గోదావరి నుంచే అందుతుంది. అయితే గోదావరికి ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు బాగా పడిపోవడంతో గోదావరి పరిధిలోని మూడు డెల్టాలకు 8240 క్యూసెక్కుల సాగునీటిని మాత్రమే విడుదల చేస్తుండగా, వాటిలో సీలేరు నుంచి 5300 క్యూసెక్కుల వరకు వస్తుండగా గోదావరి ఇన్‌ఫ్లోలు మాత్రం 2940 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం గోదావరి పూర్తిగా ఎండిపోయి ఎడారిలా వెలవెలబోతూ కనిపిస్తుంది. ప్రస్తుతం  గోదావరిలో ఇన్‌ఫ్లోలు బాగా తగ్గడంతో గోదావరిలో ఆశించిన స్థాయిలో నీరు లేక ఇసుక దిబ్బలతో ఎడారిని తలపిస్తోంది. ఏటా జూన్‌ నుంచి అక్టోబరు వరకు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. అప్పుడు జలకళతో గోదావరి కళకళలాడుతూ ఉంటుంది.