మేడారంలో భక్తజనసందడి

ప్రారంభమైన చిన్నజాతర
ములుగు,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జాతరకు మొత్తం 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గ్దదెల చెంత మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగు గ్దదెల ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. ప్రతి రెండేళ్లకోసారి పెద్ద జాతర జరుగుతుండగా.. ఆ మరుసటి సంవత్సరం చిన్న జాతరను నిర్వహిస్తారు. మండమెలిగె పండుగ పేరుతో నిర్వహించే ఈ జాతరలో ఆలయ అర్చకులు అమ్మవారి ఆలయాలను శుద్దిచేసి, జాతర విజయవంతంగా జరగాలంటూ దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. దుష్ట శక్తుల నుంచి తమ గ్రామాన్ని రక్షించాలంటూ పూజారులు ప్రార్థనలు చేస్తారు. జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్దదెల వద్ద చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. జాతర సంధర్బంగా పోలీసులు ట్రాఫిక్‌కి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.