మేడారం జాతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు

వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు

వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సీ వినోద్‌ తెలిపారు. ఇటీవలి సమ్మెతో నష్టపోయినందున జాతరలో అత్యధిక ఆదాయంపై అధికారులు దృష్టి పెట్టారు. విఇధ ప్రాంతాల నుంచి బస్సులు నడపడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న మహాజాతరకు ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజమాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల రీజినల్‌ మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు, వరంగల్‌ రీజియన్‌ సబంధించిన డిపో మేనేజర్లు, కంట్రోలర్లు హాజరయ్యారు. జాతర ఏర్పాట్లపై ఆర్టీసీ సంస్థ నుంచి తీసుకోనున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.మేడారం జాతర ఆర్టీసీ ప్రాంగణంలో కూడా జిల్లాల వారీగా బస్‌ పాయింట్లను సిద్దంచేసుకోవాలని సూచించారు. బస్సులు, రూట్ల వారీగా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ఇందుకనుగుణంగా వారికి వసతులు కల్పించాలని వినోద్‌ కోరారు. జాతర బస్సులను కండిషన్‌ ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు..భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేయడానికి ఆర్టీసీ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. గత జాతరలో 3600 బస్సులు నడిపామని ఈ సందర్భంగా వినోద్‌ వివరించారు. ఈ సారి భక్తులు మరింత పెరిగే అవకాశమున్నందున బస్సుల రాకపోకలు, అనుభవాలు , ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని మరింత పక్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ,వరంగల్‌ ఉమ్మడి జిల్లాల వారీగా జాతర బస్‌ ,బస్సుల సంఖ్య, భక్తులకోసం కల్పించాల్సిన వసతులపై మాట్లాడారు. పాత ఐదు జిల్లాల నుంచి గతంలో ఉన్న బస్‌ నుంచి ఈసారికూడా బస్సుల ఆపరేషన్స్‌ చేయాలని కోరారు. భక్తుల రద్దీనిబట్టి అవసరమైన మేరకు మరిన్ని బస్సులను నడుపాలని, ప్రతి బస్‌ పాయింట్‌ వద్ద జాతర కోసం కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే ఆర్టీసీ ఎండీ మేడారం జాతర ప్రాంతాన్ని సందర్శిస్తారని ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ ఈడీ సీ వినోద్‌ తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించి, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా వినోద్‌ రెండు రోజులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు.