మేము రాగానే 18 శాతం సింగిల్‌ శ్లాబ్‌’

ఇండియాలో ఇన్ని స్లాబ్‌లు అవసరం లేదు
పన్నుతగ్గించేలా ప్రజలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
గుజరాత్‌ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ
గాంధీనగర్‌, నవంబర్‌ 11(జ‌నంసాక్షి): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ఫ్లాట్‌ రేటు 18 శాతానికి బీజేపీ తీసుకురాకుంటే తాము 2019లో ఆ పని చేస్తామని అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొన్నారు. 200కు పైగా వస్తువులపై జీఎస్‌టీ రేటు 28 నుంచి 18 శాతానికి తగ్గిస్తూ కేంద్రం శుక్రవారం తీసుకున్న నిర్ణయం అసంతృప్తి కలిగించిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇండియాకు ఐదు వేర్వేరు పన్ను స్లాబ్‌లు అవసరం లేదన్నారు. మొత్తం జీఎస్‌టీ ప్రక్షాళన జరగాలని ఆయన సూచించారు.  కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకుసాగుతూ దేశంలోని పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ విధానంతో పేదలపైనే ఎక్కువ భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత గాంధీనగర్‌లోని ప్రసిద్ధ అక్షర్‌ ధామ్‌ దేవాలయాన్ని రాహుల్‌ దర్శించుకున్నారు. దేవాలయంలోని నారాయణుడిని పూజించారు.  రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ గుజరాత్‌ వెళ్లారు. ఈ మూడు రోజుల్లో మొత్తం ఆరు జిల్లాల్లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  ఇదిలా ఉంటే గుజరాత్‌ లో ప్రధాన సామాజికవర్గాల్లో ఒకటైన పటేళ్లు స్వామి నారాయణుడిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ అక్షర్‌ ధామ్‌ వెళ్లడం.. రాజకీయమే అని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. రాహుల్‌ హిందూ దేవాలయ దర్శనానికి వెళ్లడం ఓట్ల కోసమే అని గుజరాత్‌ బీజేపీ నేతలు అంటున్నారు.