మైనార్టీలు, గిరిజనుల ఓట్లపై టిఆర్‌ఎస్‌ దృష్టి

వారి చుట్టూ తిరుగుతున్న నేతలు

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రచారంలో టిఆర్‌ఎస్‌ జోరు పెంచింది. మైనార్టీలను ఆకట్టుకునేందుకు

కొత్తగూడెం క్లబ్‌లో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకటరావుతోపాటు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఖమ్మంలో కూడా సోమవారం మహ్మూద్‌ అలీ పర్యటన చేశారు. వివిధ జిల్లాల్లో మైనార్టీ ఓట్ల కోసం ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. ఇకపోతే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో పొట్టిగుట్ట తండా, జాటోతూ తండా, దుబ్బాతండా, దేవునిగుట్ట తండాలలో తండాబాట కార్యక్రమం నిర్వహించారు. తండాబాటలో భాగంగా గిరిజన మహిళలు మంగళ హారతులు, బోనాలు, నృత్య కళాకారులు డప్పుచప్పులతో ఎర్రబెల్లి దయాకర్‌కు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఎర్రబెల్లి వెంట డాక్టర్‌ ఎన్‌. కొమ్ముల సుధాకర్‌ రావు, జీసీసీ చైర్మన్‌ గాంధీనాయక్‌, జనగామ మార్కెట్‌ చైర్మన్‌ బండ పద్మ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లా కొత్తగడిలో తాజామాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. మళ్లీ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ కు ఓటు వేసి సీఎం కేసీఆర్‌ ను గెలిపించుకోవాలని సూచించారు.