మొక్కజొన్నలకు మద్దతు ధర

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతుధర ప్రభుత్వం చెల్లించడం కోసం చర్యలు తీసుకుందన్నారు. ప్రతిక్వింటాకు రూ.1425 కొనుగోలు చేసి రైతుకు వారి
ఖాతాల్లో డబ్బులను జమచేస్తుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రంతో పాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాతనే రైతుకు మద్దతుధర లభిస్తుందన్నారు. ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1000, రూ.1100లకు కొనుగోలు చేశారని, ఈ కేంద్రాల ఏర్పాటుతో వారు కూడా రూ.1300కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏది చేసినా రైతుల అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు. రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని సూచించారు. ఇకపోతే పండించిన పంట నిల్వ చేసేందుకు 14 లక్షల మెట్రిక్‌టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను ఏర్పాటు చేసిందని  అన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.