మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారులు పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని  ప్రాంతాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని కొనసగిస్తున్నామని అన్నారు. హరితహారం సామాజిక బాధ్యత అని అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయ తరహాలోనే తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందుకు అన్నివర్గాలవారు సహాకరించాలని కోరారు. భవిష్యత్‌ తరాలకు మంచి ప్రకృతి, నీడను అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఊరూరా మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడాలని, హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని  పిలుపునిచ్చారు.  రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని అన్నారు.  గ్రామాలలోని రైతులకు మొక్కలను అందించి నాటించాలని సూచించారు. దీంతో హరితహారం లక్ష్యాన్ని అధిగమించగలుగుతామని అన్నారు. మొక్క నాటిన ప్రతి వ్యక్తీ అది చెట్టులా ఎదిగేంత వరకు దాని పూర్తి సంరక్షణ భాధ్యత తీసుకోవాలని, అప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని అన్నారు.