మోడీ మార్క్‌ మెజార్టీ కావాలా?

భారతదేశ ప్రజలు బిజెపి కన్నా మోడీని బాగా నమ్మారు. గుజారత్‌ మోడల్‌ అంటూ ఊదరగొట్టిన మోడీని చూసి ముగ్ధులయ్యారు. యూపిఎ పదేళ్ల పాలనా వైఫల్యాలను కళ్లముందు చూస్తూ మోడీపట్ల మోహం పెంచుకున్నారు. బిజెపికి ఓ అవకాశం ..అదీ మోడీ ద్వారా ఇవ్వాలని చూశారు. అలాగే చేశారు. 2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. కానీ మోడీ పాలన వల్ల జరిగిందేమిటో ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. తాజాగా మరో రెండుమూడు నెలల్లో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు కూడా తన వైఫల్యాలను ఒప్పకునేందుకు ప్రధాని మోడీ సిద్దంగా లేరు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో స్థిరాస్తి రంగంలో నల్లధనాన్ని నియంత్రించడం ద్వారా ఇళ్ల ధరలు దిగివచ్చాయని బుకాయిస్తున్నారు. స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ ఏర్పాటు వంటి నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఒరిగిన ప్రయోజనమేమిటని తనను అడుగుతున్నారని.. అందుబాటు ధరలకు ఇళ్లు పొందిన యువతను ఆ ప్రశ్న అడిగితే జవాబు చెబుతారన్నారు. నిజానికి హైదరాబాద్‌ సహా ఏ నగరానికి వెళ్లినా రియల్‌ రంగం ఎంతగా విస్తరించిందో…దానిని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎందుకు అందుకోలేక పోతున్నారన్నది కళ్లకు కడుతుంది. స్థానిక బిజెపి నేతలను అడిగితే ఈ నిజం చెబుతారు. పెద్దనోట్ల రద్దుకు ముందు తరవాత రియల్‌ రంగాన్ని పరిశీలిస్తే ఈ దేశంలో ఇక ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అసంభవమని తేలిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే కేంద్రంలో సంపూర్ణ ఆధిక్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ప్రజలను కోరుతున్నారు. సంపూర్ణ మెజార్టీ ఇవ్వడం వల్లనే మోడీ ఇలాంటి తలాతోక లేని నిర్ణయాలు తీసుకున్నారని ఎవరిని అడిగినా చెబుతారు. ఇంతకాలం మెజార్టీ ప్రభుత్వాల వల్ల దేశానికి మేలు జరుగుతుందని అంతా భావించారు. ప్రాంతీయ పార్టీల కు అధికారం కట్టబెడితే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుదనుకున్నారు. కానీ ఈ రెండూ నిర్ణయాలు తప్పని ప్రజలు ఇప్పుడే గ్రహించారు. యూపిఎ వైఫల్యాలను చూసి మోడీకి అధికారం కట్టబెడితే ధరలు మోత మోగించా యి. మోడీ చెప్పిన ఇంటి సమస్యలు రెట్టింపు అయ్యాయి. జిఎస్టీ కారణంగా ధరలు ఎంతగా పెరిగాయో మోడీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసుకోవాలి. ఓ రకంగా మోడీ కారణంగా దేశ ప్రజలే కాదు..బిజెపికి కూడా నష్టపోయింది. అద్వానీ లాంటి వారి చేతుల్లో ఉన్నంతకాలం అమేయంగా ఉన్న ఉన్న ఇమేజ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. తన పాలనలో అనేక విజయాల గురించి చెబుతున్న ప్రధాని మోడీ.. అవేవీ సామాన్యులను బతికించలేదని, కార్పోరేట్‌ రంగాన్ని పెంచి పోషించిందని తెలుసుకోవాలి. అందుకే మోడీని అడ్డుకునేందుకు….ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టుకునేందుకు..విపక్షాలు ఏకం అయ్యాయి. చివరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకను రంగంలోకి దింపింది. ఆమెను శూర్పణఖ అన్నా.. మరేదన్నా, ప్రియాంక రాక కాంగ్రెస్‌కు జవసత్వాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. నరేంద్ర మోదీ తిరిగి అధికారానికి రాకుండా అడ్డుకోవడం అవసరమని దేశంలోని మెజారిటీ ప్రతిపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రియాంకాగాంధీని దింపాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడింది. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ మొత్తం సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకోగలదన్న విశ్వాసం ఇంకా ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో బిజెపి పై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. ఈ రాష్టాల్లో విజయం తర్వాత కూడా యుపిలో కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించడానికి బిఎస్‌పి, ఎస్‌పిలు నిర్ణయించడం చూస్తుంటే, బిజెపిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సీట్ల రూపంలో దక్కించుకోవాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్‌ చెప్పుకోదగిన

సీట్లు సాధించాలంటే యుపిలో కూడా ఆ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించాల్సిన అవసరం ఉన్నది. ప్రియాంక వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను విస్మరించి సమాజ్‌ వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు పొత్తు ఏర్పర్చుకున్న తర్వాత రాహుల్‌గాంధీ అమెరికా వెళ్లి మరీ ప్రియాంకాగాంధీని ఒప్పించి రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. కాంగ్రెస్‌కు సంబంధించి ఇది అత్యంత ముఖ్యమైన నిర్ణయంగానే చూడాలి. మోదీ, యోగీ ఆదిత్యనాథ్‌లకు పట్టు ఉన్న యుపి తూర్పు ప్రాంతాల్లో ఆమె హవా ఎంత మేరకు నడుస్తుందన్న విషయంపై చర్చ జరుగుతుండగా, ఆమె ప్రభావం ఇతర రాష్టాల్రపై కూడా ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మోడీ జిమ్మిక్కులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వెనకవుండి నడిపిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న కట్టబెట్టడం ద్వారా మోడీ రాజకీయ చతురతను ప్రదర్శించారని భావిస్తున్నారు.ఈ నిర్ణయంవల్ల బెంగాల్‌లో బిజెపికి ఎంత ప్రయోజనం ఉంటుందని కూడా అంచాన వేస్తున్నారు. అక్కడ మమతను ఎదరించి ఎంతో కొంత లబ్దిపొందాలని బిజెపి శతధా ప్రయత్నిస్తోంది. ఇక మోదీ చివరి బడ్జెట్‌లో ఎలాంటి జిమ్మిక్కులు ఉంటాయనేది తేలనుంది. మొత్తంగా మరోమారు అధికారం కోసం మోడీ వేయని ఎత్తు లేదు. సొంత పార్టీలో వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా వెన్నాడుతోంది. కేంద్రమంత్రి గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన గడ్కరీ లాంటి వారికి మోడీ తీరు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. మొత్తంగా రానున్న ఎన్నికలు మోడీకి అంత సులువు కాదన్న విషయం ప్రజలే ముందుగా పసిగట్టారు.