మోడీ మౌనమే అసలు సమస్య

నోట్ల రద్దును ఆనాడే వ్యతిరేకించానని ఆనాటి ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామరాజన్‌  ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో దేశాన్ని దివాళా తీయించిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాంకులు దివాళా తీసే స్థితికి వచ్చాయి. నగదు కొరత ఏడాదిన్నరగా వేధిస్తున్నా క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోని ఆర్థిక మంత్రి జైట్లీ తన ప్రకటనలతో ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈ దేశం నిజాయతీ పరులదని, ఇందులో అక్రమార్కులకు చోటు లేదన్న మోడీ, రాజకీయ అవినీతిని రూపుమాపడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో స్వేచ్ఛాఫలాలు సామాన్యుడి చెంతకు చేరలేదని నిత్యం ఘోషిస్తున్నా పాలకులకు పట్టడం లేదు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ను మౌనముని అంటూ నిందించిన మోడీ ఇప్పుడు తానే అతిపెద్ద మౌనమునిగా మారారు. ఏ సమస్యపైనా స్పందించడం లేదు. పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా నోరు విప్పడం లేదు. దీంతో సమస్యలను దాటవేసే ధోరణి కనిపిస్తోంది. అన్నిరంగాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు సలాం కొడుతున్న ఆత్మగౌరవ రాహిత్యం తాండవిస్తోంది. జిఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు వేధిస్తున్నా వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం దారుణం కాక మరోటి కాదు. అడుగడుగునా పాలనా వైఫల్యం కనిపిస్తున్నా దానిగురించి కప్పిపుచ్చుకుంటూ ప్రచారార్భాటలు చేయడం అలవాటుగా మారింది. అంబానీలు, అదానీల అంతులేని ధనదాహానికి దోహదం చేయడం తప్ప సాధించేదేవిూ లేదని గుర్తించుకోవాలి.  దేశ చరిత్రలో 70 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్‌ పదేపదే చెబుతున్నారు. గుణాత్మక రాజకీయాలు రావాలని అంటున్నారు. అయినా మార్పు రావడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని తాజాగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. బిజెపిలో అంతర్గ ప్రజాస్వామ్యం లోపించడం, పెద్దల ఆలోచనలను తీసుకోవడం లాంటి సంప్రదాయాలకు చెక్‌ పడింది. భారతీయజనతాపార్టీ వ్యవహారా లన్నీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. పార్టీలో ఆయన అన్నీ తానై వ్యవహరి స్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వెంటనే సొంత రాష్ట్రమైన గుజరాత్‌ నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్‌ షాను ఏరికోరి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెచ్చుకోగలిగారు. ఇక ఆ తరవాత ఆ ఇద్దరే దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  మోదీ సొంతబలంతో సర్కారును నడుపుతున్న కారణంగా నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం మాదిరిగా సమిష్టి నిర్ణయాలకు తావీయడం లేదు. పేరకు ఎన్‌డిఎ అంటున్నా అంతా మోడీ నిర్ణయాలే సాగుతున్నాయి.  మిత్రపక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకు సాగే సంప్రదాయాన్ని పక్కన పెట్టారనడానికి ఇటీవలి ఎపి పరిణామాలే నిదర్శనం. ప్రజలకు కావాల్సింది ప్రకటనలు కాదు. బ్యాంకుకో లేదా ఎటిఎంకో వెలితే డబ్బులు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం. బ్యాంకుల విశ్వసనీయతను దెబ్బతీయడంతో డబ్బులు వేయాలనుకునే వారు వాటి జోలికి పోవడం లేదు. నాలుగేళ్ల పాలన తరవాత కూడా తాను దేశాన్ని ఏ దిశగా తీసుకెళుతున్న సంగతిని ప్రధాని మోడీ గుర్తించడం లేదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాలను తెలుసు కోవడం లేదు. తాను గొప్పగా ప్రవచిస్తున్న నోట్లరద్దు, జిఎస్టీ విపరిణామాలను గుర్తించడం లేదు. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దేశంలో అరాచక పరిస్థితి నెలకొంది. బ్యాంకుల దోపిడీ, అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా సాగుతున్నా ప్రభుత్వం ఉందన్న భయం లేకుండా పోయింది. ప్రభుత్వం పథకాల పేర్లు చెప్పి చాంతాడంత జాబితాను వల్లెవేస్తోందే తప్ప ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించే పనులేవీ జరగడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ దేశాన్ని గాడిలో
పెడతామన్న వారు గాడితప్పేలా చేశారు. నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులను ఇక మనో ఐదేళ్లలో చేస్తారన్న గ్యారెంటీ లేదు. నోట్లరద్దు, జిఎస్టీ వల్ల  దేశంలో మార్పు వచ్చిందని ఘనంగా చెబుతున్న ప్రధాని మోడీ  దాని విపరీత పరిణామాలను  పరిగణించడం లేదనడానికి ప్రస్తుత ఫలితాలే నిదర్శనం. బినావిూ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చి రూ.800కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  జీఎస్టీని తీసుకొచ్చి సహకార వ్యవస్థకు జవసత్వాలు అందించామంటూ  జీఎస్టీని ఇంత తక్కువ సమయంలో ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్య పోతోందన్నారు. నిజంగా అమలు చేయాలను కుంటున్న విషయాల్లో ఖచ్చితంగా ఉంటూ, మిగతా విషయాల్లో చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని మోడీ  ప్రకటించారు. గత నాలుగేళ్లుగా మోడీ చెబుతున్న ఏ ఒక్కటి కూడా కార్యాచరణకు రావడం లేదు.  అవినీతిని అంతమొందించే క్రమంలో చిత్తశుద్దితో సాగితే ప్రజలు అండగా ఉంటారని గుర్తించాలి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తమ బతుకుల్లో మార్పు వస్తుందని భావించారు. కానీ అలాంటి సందర్భాలు రాలేదు. నోట్లు రద్దు చేసినా, జిఎస్టీ వాతలు పెట్టినా భరిస్తున్నారు. ఈ భరింపు ఎంతకాలం అన్నది ప్రధాని మోడీ ఆలోచించు కోవాలి. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించామని.. కొత్త పన్ను విధానానికి అందరి మద్దతు లభిస్తోందని చెప్పుకుంటూ ఎంతకాలం ప్రజలను వంచన చేస్తారన్నది చూడాలి. ప్రజలకు కూడా ఓపిక నశిస్తోందని గుర్తించకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకుంటే మొదటికిఏ మోసం వస్తుంది. బ్యాంకుల విశ్వసనీయతను దెబ్బతీసిన పాలకులు అవి మళ్లీ గాడిన పడేందుకు ఏం చేస్తారన్నది చూడాలి.