మోడీ వ్యతిరేక కూటమికి వేదికగా బెంగుళూరు

కాంగ్రెస్‌తో జతకట్టక తప్పని స్థితిలో ప్రాంతీయ పార్టీలు
సోనియా, రాహుల్‌తో వేదిక పంచుకున్న చంద్రబాబు
ప్రమాణ వేడుకకు దూరంగా ఒడిషా సిఎం పట్నాయక్‌
బెంగళూరు,మే23( జ‌నం సాక్షి):  నరేంద్ర మోదీ నిరంకుశత్వంపై తిరుగబాటు చేస్తున్న నేతలంలతా బెంగుళూరు వేదికగా ఒక్కటయ్యారు. కుమారస్వామి ప్రమాణ కార్యక్రమం కాస్తా విపక్షాల ఐక్యతా వేదికగా మారింది. కాంగ్రెస్‌తో విభేదాలను పక్కన పెట్టిన చంద్రబాబు లాంటి నేతలు కలసి పోవడం విశేషం.ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు ఇక్కడ వేదికపై చేరాయి. జనతాదళ్‌(సెక్యూలర్‌) చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు.  అయితే  టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ మాత్రం హాజరు కాలేదు. కేసీఆర్‌ ఒకరోజు ముందే బెగంఉళూరుకు వచ్చి కుమారస్వామిని బినందించి వెళ్లారు. ఇక తమిళనాట పరిణామాల కారణంగా స్టాలిన్‌, కమలహాసన్‌లు కుమార ప్రమాణానికి రాలేకపోయారు. బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్‌ కోసం యత్నిస్తోన్న కేసీఆర్‌.. రాహుల్‌ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్‌ కుమారస్వామికి వర్తమానం పంపారు. కాంగరెస్‌ లేకుండా బిజెపి వ్యతిరేక కూటమి కట్టలేమని ఇప్పటికే మాజీ ప్రధాని దేవేగౌడ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోనియా రావడం, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌, కేజ్రీవాల్‌ ,ఏచూరి తదితరులు కూడా వేదిక పంచుకోవడం రేపటి ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. అయితే మోడీని వ్యతిరేకిస్తున్న ఒడిషా సిఎం  నవీన్‌ పట్నాయక్‌ మాత్రం రాకపోవడానికి స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్‌ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్‌ పట్నాయక్‌.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్‌ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై  నవీన్‌ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. మైనింగ్‌ కుంభకోణం, శారద స్కామ్‌ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం
సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్‌ బీజేపీపై గట్టిగా గళం విప్పడం లేదని ఒడిశా కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్‌-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్‌ పట్నాయక్‌.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. మొత్తానికి విపక్షాల ఐక్యతకు బెంగుళూరు వేదికయ్యిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న వామపక్షాలు కూడా రేపటి రాజకీయాల్లో కలసి నడవక తప్పదన్న సం/-కేతాలు ఇచ్చారు. ఊచూరి,  రాజాల హాజరు దీనిని బలపరిచాయి.
—————-