యాదాద్రికి ఎండల దెబ్బ 

యాత్రికులకు తప్పని యాతన
యాదగిరిగుట్ట,మే21(జ‌నం సాక్షి): ఒక వైపు విస్తరణ పనులు.. మరోవైపు మండే ఎండలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని వ్యాపారులను బేజారెత్తిస్తున్నాయి. అలాగే వచ్చే యాత్రికులు కూడా బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉగ్రభానుడి దాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాటు తీవ్ర ఉక్కపోత, వేడి గాలులతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్ల విూదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే నిప్పుల వర్షం కురుస్తుండడం, పొద్దంతా వేడి గాలులు వీస్తుండడంతో ఇంటా బయటా వేడి హడలెత్తిస్తున్నది. మధ్యాహ్నం ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పనులకు విఘాతం కలుగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పనులు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జరగడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ విస్తరణ పనుల్లో కొంత నెమ్మది కనిపిస్తోంది. ఇకపోతే వారంలో ఒకటి, రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో వ్యాపారాలు జరగక సతమతమవుతున్నారు. ఎండల తీవ్రతతోనూ భక్తుల రాక తగ్గుముఖం పట్టిందన్న వాదనలు ఉన్నాయి. నీటి ఇక్కట్లే కాకుండా వసతుల కరవు కూడా యాత్రికులను యాతనపాలు చేస్తోంది. అన్నీ కలిపి భక్తుల రాకకు ఆటంకాలవుతున్నాయని స్థానికులు అంటున్నారు. సెలవులు మొదలైనా రద్దీ మాత్రం అంతంతమాత్రమే ఉండటంతో  దుకాణాలు, స్వామిదర్శన వరుసలు ఇలా వెలవెలబోయి కనిపించాయి. దీనికితోడు దేవుడి నిత్యరాబడి సైతం తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర రాజధాని నగరానికి సవిూపాన ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ మండుటెండల కారణంగా భక్తుల రద్దీ తగ్గడంతో ఆశించిన స్థాయిలో గిరాకీలేక పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు  చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇటీవల విస్తరణ పనులతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవి వచ్చిందంటే చాలు ఆలయ పరిసరాలు, పట్టణ వీధులు కిటకిటలాడటం సహజం. ఇక అత్యధిక సంఖ్యలో వచ్చే భక్తులతో వ్యాపారస్థులు తమ బేరాలు జరుపుకుంటూ ఆర్థిక లావాదేవీలు పొందేవారు. ప్రస్తుతం మాత్రం దుకాణాల నెలసరి అద్దెలు చెల్లించడం కూడా కష్టంగానే మారిందని వ్యాపారస్థులు వాపోతున్నారు. స్థానికంగా బస సదుపాయాల కరవు తిష్టవేయడంతో వచ్చిన భక్తులు సైతం బసచేయలేక తిరుగు పయణమవుతున్నారు. దీంతోనూ వ్యాపారాలు కుంటుపడ్డాయని చెప్పక తప్పదు.