యాదాద్రి చుట్టూ అడవుల పెంపకం

హరితప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు

యాదాద్రి భువనగిరి,జూన్‌19(జ‌నం సాక్షి): యాదాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ ప్రత్యేక చర్యలు చేపడుతున్నందున ఇక్కడ అటవీ ప్రాంతం పెంచి, పచ్చగా చేయాలన్నదే తమ లక్ష్యమని అటవీ సంరక్షణ అధికారి అన్నారు. హరితహారంతో పాటు ప్రత్యేకంగా ఈప్రాంతాన్ని అటవీ క్షేత్రంగా అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. గుట్టలపై రాళ్లున్న ప్రాంతాల్లోనూ మొక్కలు మొలిచే విధంగా అక్కడ రావి, మర్రి, మోదుగు వంటి విత్తనాలను సీడ్‌ బాల్‌ పద్ధతిన పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీడ్‌ బాల్‌లో మొక్కకు కావాల్సిన పోషక విలువలు గల మట్టి, ఎరువు, గోమూత్రం ద్వారా కలిపిన మిశ్రమమని చాలాచోట్ల ఆ ప్రయత్నాలు ఫలించాయని తెలిపారు. హరితహారం ద్వారా ఈ యేడు యాదగిరిగుట్ట అటవీశాఖ క్షేత్ర పరిధిలో 7 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. ఇటీవల యాదగిరిగుట్ట అటవీక్షేత్రాధికారి పరిధిలోని అటవీ భూములను పరిశీలించామని అన్నారు. హరితహారం ద్వారా మరిన్ని మొక్కలు నాటడమే కాకుండా క్షేత్రస్థాయిలో అడవుల సంరక్షణకు చర్యలు చేపడుతామని అన్నారు. వాతావరణం అనుకూలించక పోయినా మొక్కలు బలంగా పెరిగేందుకు వీలుగా యాదగిరిగుట్ట అటవీ క్షేత్ర పరిధిలో ఇటీవల రూపొందించిన విత్తన బంతుల ద్వారా మొక్కల పెంపకాన్‌ఇన విస్తృతంగా చేపడతామని అన్నారు. అటవీక్షేత్రంలో విత్తన బంతులు చల్లడాన్ని స్వయంగా పరిశీలించారు. విత్తనాల నాణ్యత, ఏయే మొక్కలు నాటుతున్నారో అక్కడి అధికారులనడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాలలో మొక్కలు మేతకు, నరికివేతకు గురికాకుండా క్షేత్ర పరిధి మొత్తం కంచె నిర్మాణం చేయడం జరిగిందన్నారు. మొక్కలు నిటారుగా ఎదగడం కోసం వివిధ పద్ధతులను అనుసరించామన్నారు.