యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి,మార్చి4(జనంసాక్షి) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభిం చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, ఈవో గీతతో పాటు పలువురు పాల్గొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించు కున్నారు. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ నుండి బయలు దేరిన అఖండ జ్యోతి శోభాయాత్రలో భువనగిరి పట్టణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డిగ్రీ కాలేజ్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి శోభాయాత్రను సాగనంపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ బండారు జయశ్రీ, కార్యక్రమ నిర్వాహకులు మంతెన నాగరాజు, సద్ది వెంకట్‌ రెడ్డి, భక్త జన బృందం పాల్గొన్నారు. ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణ మహోత్సవం, 12న దివ్యవిమాన రథోత్సవం, 13న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.