యాసంగి విత్తనాలకు కసరత్తు

సన్నద్దం అవుతున్న వ్యవసాయ శాఖ

ఖమ్మం,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): త్వరలో యాసంగి సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఆదిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయకట్టు ప్రాంతంలో ఆశించిన మేర వరి సాగు జరగకపోవడం, మిర్చి పంటను సైతం సాగు చేసేందుకు రైతాంగం కొంత అయిష్టత చూపడం వలన లక్ష్యానికి కొంత తక్కువగా సాగు జరిగింది. అయితే యాసంగి సీజన్‌లో మాత్రం సాధారణసాగుకు మించి పంటల సాగు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు చెరువులకు, కుంటలకు, ఆయా ప్రాజెక్టులకు పూర్తిగా వరదనీరు రావడంతో జలకళను సంతరించుకున్నాయి. వాతావరణం అనుకూలించడం, ఆశించిన మేర నీటి వనరులు అందుబాటులో ఉండటంతో రైతులకు అన్నిరకాల వసతులు కల్పించి యాసంగిలో మంచి ఫలితాలు రాబట్టాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఖరీఫ్‌ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటం తో యాసంగికి సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా వ్యవసాయశాఖ నిమగ్నమయ్యింది. సీజన్‌కు ముందుగానే అవసరమైన విత్తనాలు, ఎరువులను అన్నదాతలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఒక్క రైతులకు విత్తన, ఎరువుల కొరత రావద్దనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు.వచ్చే యాసంగిలో జిల్లావ్యాప్తంగా సుమారు 78,250 హెక్టార్లలో వివిధరకాల పంటలు సాగుకావచ్చని అధికారుల అంచనా. జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న సహకార సంఘాలకు ముందుగానే విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.