యాసంగి వ్యవసాయంపై శిక్షణ

నిజామాబాద్‌,డిసెంబర్‌13(జ‌నంసాక్షి): నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిలాల్లోని అభ్యుదయ రైతులు, మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులకు రబీ పంటల సాగు పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.యాసంగిలో వరి, మొక్కజొన్న సాగు చేసే విధానంపై శిక్షణలో అవగాహన కల్పిస్తారు.  పంట సాగులో రైతులు పాటించాల్సిన సాంకేతిక సలహాలు, సూచనలు, ఎరువులు యాజమాన్యం, నీటి యాజమాన్యం పద్దతులను ఎలా అవలంబించాలనే అంశాలపై సంపూర్ణంగా అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో సీనియర్‌ శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగుపై శిక్షణ ఇస్తారు. ప్రతి మండలం నుంచి
పదిహేను మంది వరకు అభ్యుదయ రైతులు, వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే పంటలు వేసే ముందు ప్రతి రైతూ భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏఈవో పరిధిలో భూసార పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడంతో గ్రామాల్లో భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు.రైతులు పంట మార్పిడి పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. భూసార పరీక్ష మట్టి నమూనాలను పరీశిలించారు.