యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు 

– ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీరందిస్తున్నాం
– ఏపీ మంత్రి నారాయణ
– పలాస, ఇచ్చాపురంలలో పర్యటించిన మంత్రి
శ్రీకాకుళం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పలాస, ఇచ్చాపురంలలో యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ అన్నారు. సోమవరాం ఆయన శ్రీకాకుళంలోని తితలీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో పారిశుధ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి స్వీపింగ్‌ మిషన్లు, వాటర్‌ ట్యాంకర్లు, వేస్ట్‌ డంపింగ్‌ కోసం లారీలు, విద్యుత్‌ రంపాలు తెప్పించామని, అలాగే పారిశుధ్య కార్మికులను పిలిపించినట్లు వెల్లడించారు. పలాస, ఇచ్చాపురం పట్టణాల్లో అన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని అందిస్తున్నామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌, మెప్మా వారి సహాయంతో పలాస పట్టణంలో ఆహారం అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. పలాస పట్టణంలో మూడు పూటల 10,000 మందికి, ఇచ్చాపురంలో 8,000 మందికి ఆహారాన్ని అందించగలిగామని, పలాస మండలం లోని 19గ్రామ పంచాయతీలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం పలాస మండలం లోని గ్రామాలకు 2లక్షల వాటర్‌ ప్యాకెట్లు, 20,000 ఆహార పొట్లాలు
అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 13మండలాల్లోను మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సుల పునరుద్దరణ..
తితలీ తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించింది. మొత్తం 393 సర్వీసులను పునరుద్ధరించినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. టెక్కలిలో 52, శ్రీకాకుళం మండలంలో 187 బస్సులు, పాలకొండ డిపోలో 87 సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో బస్సులు తిరుగకపోతే ప్రజలు 1100 కాల్‌ సెంటర్‌కు ఫి ర్యాదు చేయవచ్చని పేర్కొంది.