యువకుడిని బలితీసుకున్న సెల్ఫీ సరదా

పామును మెడలో వేసుకుని సెల్ఫీ కోసం యత్నం

నాగరాజు కాటేయడంతో యమరాజు దగ్గరకు వెళ్లిన యువకుడు

నెల్లూరు,నవంబర్‌14(జ‌నంసాక్షి): సెల్ఫీ సరదా ఎంతప్రమాదమో అతనికి తెలియకుండానే కన్నుమూశాడు. అదీ ఓ విష సర్పాన్ని మెడలో వేసుకుని సెల్ఫీ దిగాలనుకున్నాడు. పాపం పాముకు కాటు వేయడం తప్ప మరోటి తెలియదు కనుక అతను ఫోటో కోసం మెడలో వేసుకున్నా ఠక్కున కాటేసి అతడిని యమసదనానికి పంపేసింది. దీంతో సరదాగా పాముతో ఫొటొ దిగాలనుకున్న యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాముల ప్రదర్శనతో జీవనం సాగించే వ్యక్తి వద్ద ఉన్న సర్పాన్ని యువకుడు మెడలో వేసుకుని ఫొటొ దిగడానికి ఉబలాటపడ్డాడు. అతను వారించినా వినకుండా కావాలంటూ పట్టుబట్టాడు. ఈ క్రమంలో పాము మెడలో వేసుకుని ఫోటో దిగుతుండగానే కాటువేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. అతన్ని చూసి అంతా అయ్యోపాపం అనుకున్నారు.