యూఎస్‌సీఐఎస్‌పై ఐటీ కంపెనీల దావా

– హెచ్‌-1బీ వీసాల పరిమితి తగ్గింపుపై ఫిర్యాదు
వాషింగ్టన్‌, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : అమెరికాలోని ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌పై ఐటా కంపెనీల బృందం దావా వేసింది. ఈ ఐటీ కంపెనీల బృందంలో అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కంపెనీలను భారత సంతతికి చెందిన వ్యక్తులే నడిపిస్తున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ హెచ్‌-1బీ వీసాలపై మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం ఫిర్యాదు చేసింది. చాలా తక్కువ కాలానికి వీసా ఇస్తోందంటూ దావా వేసింది. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులకు అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వొచ్చు. ఈ వీసాల ఆధారంగా వేలాది మంది భారతీయులు, చైనీయులు, ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ల కాలానికి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు అమెరికాలోఉద్యోగం చేసుకోవచ్చు. అయితే ఇటీవల మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితితో వీసాలు ఇస్తున్నారు. దీంతో టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న ఐటీ సర్వ్‌ అలియన్స్‌ అమెరికా పౌర, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌)పై దావా వేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్‌సీఐఎస్‌కు అధికారం లేదని ఐటీ సర్వ్‌ అలియన్స్‌ ఆరోపిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌ ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌(డీఓఎల్‌)కు అధికారాలిచ్చిందని, డీఓఎల్‌ నిబంధనల ప్రకారం మూడేళ్ల అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఐటీ కంపెనీలు యూఎస్‌సీఐఎస్‌పై వేసిన రెండో దావా ఇది. 2018 జులైలో మొదటి దావా వేశాయి.