యూపీలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

లక్నో ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు ముగిసిన అనంతరం సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్‌ వెల్లడించారు. యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. బిజ్నూర్‌, బులంధ్‌సాహర్‌, ముజఫర్‌నగర్‌, విూరట్‌, ఆగ్రా, ఫిరోజాబాద్‌, సాంభాల్‌, అలీఘర్‌, ఘజియాబాద్‌, రామ్‌పూర్‌, సితాపూర్‌, కాన్పూర్‌తో పాటు పలు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 75 జిల్లాలకు గానూ 21 జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు. కేంద్ర బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించే అంశంపై ఆలోచిస్తామన్నారు డీజీపీ. తాము అమాయకులను ముట్టుకోవడం లేదు. హింస, ఆందోళనలకు ప్రేరేపిస్తున్న వ్యక్తులను మాత్రమే అదుపులోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.