రక్తంమరుగుతుంది..

– దాడికి కారకులైన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు
– అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతాం
– సైనికుల ధైర్య సాహసాలపై నమ్మకం ఉంది
– దాడులతో భారత్‌ను అస్తిరపర్చలేరు
– ప్రధాని నరేంద్ర మోదీ
– అమరవీరుల నివాళులర్పించిన మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : గురువారం జవాన్లపై జరిగిన దాడితో భారత్‌ ప్రజల రక్తం మరుగుతుందని, దాడులకు కారకులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో శుక్రవారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు.  అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతామని.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. సైనికుల ధైర్య సాహసాలపై నమ్మకం ఉందని.. భారత్‌లో అస్థిరత్వం సృష్టించే ప్రయత్నాలు సాగవన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి దాడులను ఖండించాల్సిందేనని పునరుద్ఘాటించారు. దాడికి పాల్పడివారిన వదిలేది లేదన్నారు. ఉగ్రవాదులు, వారి వెనకున్న వారు పెద్ద సాహసమే చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రాదాడి నేపథ్యంలో మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. మానవతావాదులంతా కలిసి పోరాడాల్సిన సమయం ఇదని.. తీవ్రవాదులతో పోరాటంలో ఒక్కటై సాగాలన్నారు. పుల్వామా దాడి తర్వాత మనసంతా దుఃఖంతో నిండిపోయిందన్నారు. ఇలాంటి చర్యలతో తిప్పికొట్టడంలో వెనకడుగు వేసే దేశం మనది కాదన్నారు. దేశ రక్షణ.. సమృద్ధి అనే రెండు కలలతో సైనికులు జీవిస్తుంటారని.. వాటి సాకారం కోసం ప్రతి క్షణం పాటుపడదామని మోదీ అన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న పాకిస్థాన్‌పైనా ప్రతీకారం తీర్చుకునే తీరతామన్నారు. జవాన్లపై జరిగిన దాడితో 130 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోతోందని.. దానికి దీటైన సమాధానం చెబుతామన్నారు. ఉగ్రవాదంపై మానవాళి అంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అన్నారు. మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. అమరుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువదని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా అందరూ కలిసి పోరాడాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రధాని అధ్యక్షతన కీలక భేటీ ..
జమ్ముకశ్మీర్‌ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ఈ భేటీలో చర్చించారు. ఉరి ఘటన కంటే ఈ ఉగ్రదాడిలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండటంతో.. ఉగ్రవాద మూకలకు గట్టి హెచ్చరిక పంపాలన్న దానిపై మంత్రివర్గం చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలో భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా సవిూక్షించారు.