రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్14(జనం సాక్షి):
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతి ప్రధానమైందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.
మంగళవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా ఉన్న 135 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరపడుతుందని,అయితే రక్తదాతల నుంచి లభిస్తుంది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనన్నారు.
దేశంలో ప్రతి రోజు దాదాపు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నరని తెలిపారు.
 గత కొన్ని సంవత్సరాలుగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన మాత్రం రక్త అవసరాలను తీర్చడానికి చాలటం లేదన్నారు.ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అధికంగా అవసరపడుతుందన్నారు.
తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందేన్నారు.రక్తదానం పై కొంతమందిలో అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావటం లేదని, 18 సంవత్సరాలు నిండి 12.5 హిమోగ్లోబిన్‌ స్థాయితో 45 నుంచి 50 కిలోల బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తదానానికి అర్హులన్నారు.ఒక్కో వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు రక్తదానం చేయవచ్చని అరోగ్య నిపుణులు నిర్ధారించారన్నారు.ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు రక్తదాతల కోసం అవగాహనా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో రక్త నిధులను సమకూర్చలేకపోతున్నామన్నారు.షుగర్, హెచ్‌ఐవీ, హెపటైటీస్, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు స్వచ్చంథంగా రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. తరచు రక్తదానం చేసేవారికి గుండెపోటు, క్యాన్సర్‌ వంటి జబ్బులు దరిచేరవని మెడికల్ సర్వేలు వెల్లడించాయన్నారు.
రక్తదానం చేసిన వైద్యులను కలెక్టర్ అభినందిస్తూ సర్టిఫికెట్లును ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూ చౌదరి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమాదేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, డిసి హెచ్ డాక్టర్ రమేష్, చిన్న పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ రోహిత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.