రజతంతో సరి

– ఫైనల్‌లో ఓటమి పాలైన పీవీ సింధు
– రజతం గెలిచిన తొలి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధు
జకర్తా, ఆగస్టు28(జ‌నం సాక్షి) : భారత అగశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధును ఫైనల్‌ పోబియా వెంటాడుతూనే ఉంది. మరోసారి సింధూ ఫైనల్‌లో విజయకేతనం ఎగురవేయలేక పోయింది. దీంతో ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. ఫైనెల్లో సింధు ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో రెండు వరుస గేమ్‌ల్లో ఓడి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఫైనల్స్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉంది. తొలి గేమ్‌ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది. కానీ, కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు కదలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది. డ్రాప్‌ షాట్లు, స్మాష్లు ఆడుతూ తైజు… సింధును ఒత్తిడికి గురి చేసింది. దీంతో సింధు 13-21తో తొలి సెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో గేమ్‌ను బాగానే ఆరంభించిన సింధు అదే జోరును
కొనసాగించలేకపోయింది. దీంతో రెండో గేమ్‌ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం. ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. 1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. సోమవారం సెవిూ ఫైనల్‌లో ఓడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.