రఫేల్‌పై మోడీని నిలదీయండి

ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌ పిలుపు
న్యూఢిల్లీ,జనవరి5(ఆర్‌ఎన్‌ఎ): రఫేల్‌ ఒప్పందంపై తాను అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం లోక్‌సభలో కూడా సమాధానం చెప్పలేదని, విూరు కూడా ఈ ప్రశ్నలను అడగండి అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశ ప్రజలను కోరారు. రక్షణమంత్రి పార్లమెంట్‌లో 2 గంటల పాటు ప్రసంగించారు, కానీ తాను అడిగిన రెండు సులువైన ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేకపోయారున్నారు.  ఇప్పుడు ఈ ప్రశ్నలకు ప్రతి ఒక్క భారతీయుడు.. ప్రధాని మోదీ, ఆయన మంత్రులను అడగాలని అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రాహుల్‌ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. రఫేల్‌ వివాదంపై లోక్‌సభలో శుక్రవరాం  వాడీవేడీ చర్చ జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ రఫేల్‌పై సుదీర్ఘ ప్రసంగం చేస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన రాహుల్‌.. ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని దుయ్యబట్టారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యహారంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శల దాడికి దిగాయి. రఫేల్‌ వ్యవహారానికి ప్రధాని మోదీదే బాధ్యత అని రాహుల్‌గాంధీ ఆరోపించారు. విపక్షాల విమర్శలకు రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌ దీటుగా స్పందించారు. దాదాపు 2 గంటల సేపు అంశాల వారీగా వివరణ ఇచ్చారు. కుంభకోణం అనడానికి ఇదేవిూ బోఫోర్స్‌ కాదని, దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.అయితే తాను అడిగిన ఒప్పంద వివరాలను మాత్రం చెప్పలేకపోయారని రాహుల్‌ విమర్శలు గుప్పించారు.