రమణ దీక్షితులు చాలా తప్పులు చేశారు

– వాటిపై విచారణ జరిపిస్తాం
– డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
అమరావతి, మే17(జ‌నం సాక్షి) : ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని.. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ..  ఏడుకొండల గురించి గతంలో చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని.. రమణ దీక్షితులు గతంలో చేసిన తప్పులపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి నగలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అధికారులు వాటిని ఏటా పరిశీలిస్తారని కేఈ తెలిపారు. రమణ దీక్షితులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
———————————-