రవాణాలో ఆలస్యం వల్లే ఏటీఎంలు ఖాళీ

– రిజర్వ్‌ బ్యాంక్‌ వివరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేవలం రవాణాలో ఏర్పడిన సమస్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విూడియాకు వివరించింది. ఆర్‌బిఐ వాల్టుల్లో, కరెన్సీ చెస్ట్‌లలో చాలినంత నగదు ఉందని, నాలుగు కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌లు నిర్విరామంగా పని చేస్తున్నాయని పేర్కొంది. కొన్ని చోట్ల డబ్బు రవాణా ఆలస్యమైన కారణంగానే నగదు కొరత ఏర్పడిందని, ఇది తాత్కాలికమేనని, ఏటీఎంలలో నగదు నింపే పని జరుగుతోందని తెలిపింది. పరిస్థితిని రిజర్వ్‌ బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, కరెన్సీ అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేశామని పేర్కొంది. కర్ణాటక, ఆంధప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో ప్రజలు గత రెండు మూడు వారాలుగా నగదుకోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. బయటకు వెళ్లిన రూ. 2వేల నోట్లు తిరిగి బ్యాంకులకు రాకపోవడం వల్లే ఇలా జరిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.