రసవత్తరం కానున్న ఖానాపూర్‌

రాథోడ్‌ రాకతో గెలుపు సునాయసం అంటున్న నేతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లే. టిక్కెట్‌ దక్కకపోవడంతో టిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాథోడ్‌ రమేశ్‌ ఎట్టకేలకు ఖానాపూర్‌ టిక్కెట్‌ దక్కించుకోవడంతో ఇక్కడ పోటీ రసవత్తరం కానుంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు, ఎంపిగా పినచేసిన అనుభవం, టిడిపిలో పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్న కారణంగా ఆయనకు కలసి వచ్చే అంశాలుగా చూడాలి. ఉత్కంఠ, ఊహాగానాలకు తెరదించుతూ మంగళవారం కాంగ్రెస్‌ స్కీన్రింగ్‌ కమిటీ ప్రకటించిన రెండో జాబితాలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌కు చోటు దక్కింది. అంతకుముందు తొలి జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. రాథోడ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో కార్యకర్తలు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి ఆయన బరిలో దిగనున్నారు. గతంలో మొదటిసారి 1999లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన రెండోసారి ఓటమిపాలయ్యారు. ఇక మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీచేసి తన భవితవ్వాన్ని తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. మూడు జిల్లాలలో విస్తరించి ఉన్న గిరిజన నియోజకవర్గం ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది తేలడంతో ఇక గెలుపు ఎవరిదన్నది చూడాలి. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్‌ కోసం ప్రయత్నించి ఆయన సఫలం అయ్యారు.మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, గతంలో పోటీ చేసిన హరినాయక్‌ సైతం బలంగా ప్రయత్నాలు చేసినా రాథోడ్‌కే టిక్కెట్‌ ఇచ్చారు. గాంధీభవన్‌ వద్ద హరినాయక్‌కు టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. రాథోడ్‌ రమేశ్‌ టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి టికెట్‌ కోసమే ఇటీవల పార్టీలో చేరాడని, ఆయనకు టికెట్‌ ఎలా ఇస్తారని నిలదీసినా గెలుపు సునాయసం కానుందని అధఙష్టానం భావించి టిక్కెట్‌ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆయన ఇక్కడ అధికార టిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను ఢీకొనబోతున్నారు.