రహదారి విస్తరణకు భూసేకరణ

అధికారుల పరిశీలనలో సవిూప గ్రామాలు
నల్లగొండ,మార్చి8(ఆర్‌ఎన్‌ఎ): నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి త్వరలో జాతీయ రహదారిగా మారనుండడంతో అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఎక్కెడక్కడ ఎంతెంత భూమి అవసరమో లెక్కలు తీస్తున్నారు.  దీనిని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు వెల్లడించడంతో సిక్స్‌ లేన్‌ రోడ్డుగా విస్తరించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో 60 కిలోవిూటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై వెళ్లేందుకు వీలుగా ఉండటంతో పాటు ఇటు ఏపీ రాజధాని అమరావతికి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రహదారిని కలుపుతూ పలు నూతన మార్గాలను మంజూరు చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రహదారిపై దృష్టి సారించడంతో భవిష్యత్తులో ఈ మార్గం మరింత అభివృద్ధి చెందనుంది. జాతీయ రహదారిగా గుర్తించిన వెంటనే ఆరు వరుసలకు సరిపడా భూసేకరణ జరగవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే రహదారి వెంట ఉన్న గ్రామాలలో నాలుగు వరుసలకు సరిపడా భూసేకరణ చేయలేదు. దామరచర్ల, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి తదితర మండల కేంద్రాల వద్ద పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మూడు నెలల్లో ఈ మార్గానికి జాతీయ రహదారిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటు న్నారు. ఈ మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్‌-నడికుడి రైల్వే మార్గం ఉంది. దీనికి చేరువలో యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు మంజూరు దశలో ఉండగా, డ్రైపోర్టు నిర్మాణం ప్రతిపాదన దశలో ఉంది.  2004లో వాడపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన వంతెనతో నార్కట్‌పల్లి-అద్దంకి మధ్య రహదారి ఏర్పాటైంది. నార్కట్‌పల్లి వద్ద ప్రారంభమై నల్గొండ, మిర్యాలగూడ, దామరచర్ల విూదుగా వాడపల్లి వద్దనున్న కృష్ణానది వంతెన సవిూపంలో రాష్ట్ర సరిహద్దు ముగుస్తుంది.  చాలా గ్రామాలలో రహదారి పనులను అసంపూర్తిగా వదిలేశారు. పన్ను వసూలు చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తయింది. ఇక కొత్తగా సవిూప గ్రామాల్లో భూసేకరణ చేయడం ద్వారా దీనిని విస్తరించనున్నారు.