రహదారి సమస్యలు యధాతథం

సూర్యాపేట,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలను కలిపే ప్రధాన మార్గాలను విస్తరించాలని అనుకున్నా వాటిని పట్టించుకోక పోవడంతో రోడ్లన్నీ ఎగుడుదిగుడుగా, గుంతల మయంగా మారాయి. రోడ్లను వర్షాకాలనికి ముందే నెలలోపుగా సరిచేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించినా అవి అమలు కావడం లేదు. గుంతల రోడ్లతో వాహనదారుల వెన్నుపూసలు విరుగుతున్నాయి. గుంతలుండి.. రాళ్లు మొనదేలి ప్రయాణం నరకంగా మారుతోంది. దీనిపై ప్రయాణిస్తే ఒళ్లుగుల్లయి, వెన్నుపూసలు కదులుతాయి. వివిధ ప్రాంతాల నుంచి నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొన్నిచోట్ల నిర్మాణ పనులను కిలోవిూటర్ల వారిగా ఉప గుత్తేదారులకు పంచడంతో పనులు అస్తవ్యస్తంగా మారాయి. కొంతదూరం పనులు చేయటం.. నిలిపివేయటంతో వ్యవహారమంతా అస్తవ్యస్తంగా మారింది. నాసిరకంగా పనులను చేపడుతుండగా నిర్మాణ పనులు కొంతదూరం ఒకరకంగా, మరికొంత దూరం మరోరకంగా పనులు చేస్తున్నారు. ఒకే పద్ధతిలో నిర్మాణ పనులు చేయకపోవటంతో వాహనాలపై వెళ్లేవారు నరకయాతన అనుభవిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. చీకటి పడితే రోడ్డుపై గుంతలు కనిపించటం లేదని, భారీ వాహనాలు పక్కనుంచి వెళ్తే దుమ్ము కొట్టుకుపోతామని ప్రయాణికులు వాపోతున్నారు. రాత్రివేళలో ద్విచక్ర వాహనాల లైట్ల వెలుగులో గుంతలు కనిపించక ప్రమాదాల పాలై ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ మార్గంలో పెద్దపెద్ద గుంతలు ఉండడంతో ఆర్టీసీవారు కూడా కాలంతీరిన బస్సులను నడుపుతున్నారు.

…………………..