రాఖీ పండుగ పురస్కరించుకొని గ్రామాల్లో రక్షాబంధన్ కార్యక్రమాలు

మోమిన్ పేట ఆగస్టు 12 జనం సాక్షి
రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలకు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్న కోల్కుంద గ్రామంలో తమ నివాసం వద్ద ముగ్గురు చెల్లెళ్లు ఆయనకు  రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ పౌర్ణమిని అందరూ ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని  తెలిపారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ములకు అనురాగంతో చేతికి రాఖీ కట్టడం గొప్ప సాంప్రదాయమని అన్నారు. ఇది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన ఆత్మీయ పండుగని చెప్పారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజలలో సహోదరతత్వాన్ని మరింత పెంచుతుందని ఆయన ఆకాంక్షించారు. అలాగే, అనాది నుంచి కొనసాగుతున్న ఈ గొప్ప పండుగ ఈ సారి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రావడం విశేషం అని అన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షా బంధన్ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై ఆత్మీయతతో పాటు జాతీయ స్ఫూర్తిని చాటాలని, ఈ రాఖీ పౌర్ణమి, స్వతంత్ర వేడుకలు ప్రజల మధ్య సంఘీభావాన్ని, మనమంతా ఒకటే అనే ఏకీభావాన్ని మరింతగా ఇనుమడింప చేయాలని సర్పంచ్ కొనింటి సురేష్  ఆకాంక్షించారు.