రాజకీయంగా కలసిరాని కాలంలో నేతలు

రాజకీయ దురంధరుడిగా పేరున్నా ఓటమి
ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా సముద్రాల
హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): రాజకీయంగా సీనియర్‌ నేతలుగా ఉన్న వారెందరో కనుమరుగ వుతున్నారు. రాజకీయ వ్యూహాలు ఉన్నా పరిస్థితులు కలసిరావడం లేదు. అందులో సీనియర్‌ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం రాలేదు. సిఎం కెసిఆర్‌కు సన్నిహితుడిగా పేరున్నా ఢిల్లీకే పరిమితం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం మాత్రం ఇవ్వలేదు. మల్కాజిగిరిలో పోటీ చేయిస్తారని భావించినా అడుగు పడలేదు. ఇప్పుడు మరోమారు అదే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై అక్కడక్డక కొద్దిగా మాత్రం ఆయన పేరు విపడుతోంది. అయితే ఆర్థిక అంగబలం ఉన్నావారినే కెసిఆర్‌ పోటీకి నిలుపుతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా చంద్రబాబుకు సమకాలికుడిగా… నమ్మకమైన వ్యక్తిగా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయనే సుప్రీం… టికెట్ల కేటాయింపులు, పదవుల పంపకాల్లో ఆయన చెప్పిందే వేదం… ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఎందరో నాయకులకు రాజకీయ గురువుగా మారారు. అలాంటి సముద్రాల వేణుగోపాలాచారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మౌనంగా వీక్షిస్తున్నారు. 1985లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసింది మొదలు టీడీపీ నుంచి బయటకు వచ్చిన 2012 వరకు రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా చలామణి అయిన ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా తొలి విజయం  అందుకున్న చారి.. ఎన్టీరామారావు సైతం ఓటమి పాలైన 1989లో కూడా నిర్మల్‌ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీలో పట్టు సాధించిన ఆయన చంద్రబాబు వర్గంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తనతో పాటే 1985లో సిద్దిపేట నుంచి గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఆనాటి నుంచి చారి తెలుగుదేశం పార్టీని వీడేంత వరకు పార్టీలో కీలకమైన నాయకుడిగా వ్యవహరించారు. ఎందరో నేతలు చారి కనుసన్నల్లో ఉన్నత స్థానాల్లోకి ఎదిగారు. మొన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రజాప్రతినిధులుగా వ్యవరించిన నేతల్లో ఎక్కువ శాతం మంది వేణుగోపాలచారి రాజకీయ నీడలో ఎదిగినవారే అనడంలో అతిశయోక్తి లేదు. 2014లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముథోల్‌ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవడం  తొలిదెబ్బ అనే చెప్పాలి.
ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ సాధించిన ఏకైక సీటు విఠల్‌రెడ్డిదే కావడం చారిని కుంగదీసిందనే అనుకోవాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్‌ పాత మిత్రుడైన చారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్‌ ¬దా కట్టబెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన
తరువాత ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజకీయాలు నడిపించిన వేణుగోపాలాచారి 2014లో ఓటమి తరువాత ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితం కావలసిన పరిస్థితి ఎదురైంది. ముథోల్‌లో తనపై గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు మరోసారి టికెట్టు తెచ్చుకుని విజయం సాధించడంతో ఇప్పుడు చారికి స్థానం లేకుండా పోయింది.  1985లో తొలిసారి పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడూ ఆదిలాబాద్‌ రాజకీయాలకు దూరంగా లేని చారి ఈసారి కనీసం పోటీ చేసే అవకాశానికి నోచుకోవడం విధి వైపరీత్యమే! 1985 నుంచి వరుసగా 1996 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన చారి దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ మంత్రివర్గంలో సంప్రదాయేతర ఇంధనవనరుల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి గెలిచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1999లో మూడోసారి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచి 2004 వరకు కొనసాగారు.  2009లో కొత్తగా ఏర్పాటైన ముథోల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ముథోల్‌ నుంచి మరోసారి  2014 ఎన్నిల్లో ఓటమిపాలు కావడంతో ఆయన రాజకీయ జీవితానికి గండిపడింది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావాల్సి వచ్చింది.