రాజధాని అమరావతిలోనే ఉండాలి

– ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు వివరించా
– అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటా
– వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌
అమరావతి, జనవరి 7(జనంసాక్షి) : రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను కోరుకుంటున్నా అని చెప్పారు. నా అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వానికి కూడా చెప్పాను అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. అయితే తన అభిప్రాయం ఎలా ఉన్నా.. జగన్‌ నిర్ణయమే ఫైనల్‌ అని ఎమ్మెల్యే వసంత ప్రసాద్‌ స్పష్టం చేశారు. క్రమశిక్షణ గల నాయకుడిగా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అని చెప్పారు. జగన్‌ బలవంతుడు.. ఆయన నిర్ణయమే శిరోధార్యం అని అన్నారు. రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. రాజధాని మార్పు ప్రతిపాదన దుమారం రేపుతోంది. భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లోనే కాదు రాజకీయ నాయకుల్లోనూ చర్చకు దారితీసింది. మూడు రాజధానుల ప్రతిపాదనను కొందరు స్వాగతిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ది వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాలంటున్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు. రాజధాని గ్రామాల్లో మాత్రం రైతులు ఆందోళన బాట పట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని మార్పుని అంగీకరించేది లేదన్నారు. గతంలో అమరావతి రాజధానిగా అంగీకరించిన జగన్‌.. సీఎం అయ్యాక ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను కోరుకుంటున్నా అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. తన అభిప్రాయం ఎలా ఉన్నా.. జగన్‌ నిర్ణయమే ్గ/నైల్‌ అని ఎమ్మెల్యే వసంత ప్రసాద్‌ అన్నప్పటికీ.. దీనిపై వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.