రాజనీతిజ్ఞుడికి ఘన నివాళి 

– కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు
– వాజ్‌పేయి పార్దివదేహానికి నివాళులర్పించిన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు
– మాజీ ప్రధానితో గత స్మృతులను నెమరవేసుకున్న ప్రముఖులు
– అశ్రునయనాల మధ్య సాగిన అంతిమయాత్ర
– అతిమయాత్రలోపాల్గొన్న బీజేపీ పెద్దలు, ఇతర పార్టీల ప్రముఖ నేతలు
– స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలన దక్షుడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయీ గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం విధితమే. ఓ గొప్ప రాజకీయ దిగ్గజం నేలరాలిపోవడంతో దేశమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఉదయం నుంచి తమ అభిమాన నేతను చూసేందుకు అభిమానులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు బారులు తీరారు. ఉదయం 7.30గంటల నుంచి పార్ధివదేహాన్ని సందర్శనార్ధం ఉంచారు. అనంతరం 11గంటల ప్రాంతంలో అక్కడి నుండి పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉంచారు.. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అంతిమయాత్ర నిర్వహించారు. బీజేపీ కార్యాలయం నుంచి అంతిమయాత్ర అశ్రునయనాళ మధ్య సాగింది.. అంత్యక్రియల్‌లో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు బీజేపీ పాలిత సీఎంలు పాల్గొన్నారు. రెండుగంటల పాటు సాగిన అంతిమయాత్ర అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో యమునా నది ఒడ్డున స్మృతి స్థల్‌ వద్ద వాజ్‌పేయ్‌ అంత్యక్రియలను నిర్వహించారు..
పార్దివదేహానికి నివాళులర్పించిన ప్రముఖులు..
శుక్రవారం ఉదయం 7.30గంటల నుంచి ప్రజల సందర్శనార్ధం దీన్‌దయాళ్‌ వద్ద మృతదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంలో వాజ్‌పేయీని కడసారి చూసేందుకు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పోటెత్తారు. పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు నివాళులర్పించి గత స్మృతులను నెమరవేసుకున్నారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ మార్గంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం మృతదేహాన్ని ఉంచారు. కాగా మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ఆయన చిరకాల మిత్రుడు ఎల్‌కే అడ్వాణీ కన్నీటితో వీడ్కోలు పలికారు. తన కుమార్తె ప్రతిభా అడ్వాణీతో కలిసి వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వీరివెంట శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించిన అనంతరం అడ్వాణీ తీవ్ర విచారంతో తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు. వాజ్‌పేయి, అడ్వాణీ మధ్య 65 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు స్నేహబంధం కొనసాగిన సంగతి తెలిసిందే. వాజ్‌ పేయి పార్ధివదేహానికి గురువారం రాత్రి ఆయన ఇంట్లోనే ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌ సభ స్పీకర్‌, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు, రాష్టాల్ర ముఖ్యమంత్రులు, ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీల అధ్యక్షులు, త్రివిధ దళాల అధిపతులు నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం కూడా ప్రముఖుల నివాళుల తర్వాత అటల్‌ జీ పార్ధివదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌ లో ప్రధాని మోడీతో పాటు
అమిత్‌ షా, వాజ్‌ పేయి పార్ధివదేహానికి నివాళులర్పించారు. వాజ్‌పేయికి నివాళులర్పించినవారిలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ రామ్‌ నాయక్‌ ఉన్నారు. అద్వానీ తన కుమార్తె ప్రతిభ అద్వానీతో సహా వచ్చి, వాజ్‌పేయికి నివాళులర్పించారు. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే తన కుటుంబ సభ్యులతో సహా బీజేపీ కార్యాలయానికి వచ్చి, వాజ్‌పేయికి నివాళులర్పించారు. డీఎంకే నేత ఏ రాజా, అస్సాం సీఎం శర్వానంద్‌ సోనోవాల్‌, మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఎంపీ కేశినేని నానిలతో పాటు తదితరులు వాజ్‌పేయికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం 11గంటల ప్రాంతంలో పార్దివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయంకు తరలించారు. భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలు కడసారి తమ నేతను చూసేందుకు తరలి వచ్చారు.
అభిమానేతను కడసారి చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి..
తమ అభిమాన నేతను కడసారి చూసి నివాళులర్పించేందుకు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేవలం ఢిల్లీ, పరిసర ప్రాంతాల నుంచే గాక.. బిహార్‌, ఉత్తరాఖండ్‌ నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాజ్‌పేయీ మరణం గురించి తెలియగానే ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీకి చెందిన యోగేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి తన బృందంతో కలిసి ఢిల్లీ వచ్చారు. రాత్రంతా దాదాపు 500 కిలోవిూటర్లు ప్రయాణించి దేశరాజధానికి చేరుకుని వాజ్‌పేయీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యోగేశ్‌ మాట్లాడుతూ.. ‘1984లో వాజ్‌పేయీని నేను తొలిసారిగా కలిశాను. ఆ సంవత్సరం గంగోత్రికి వెళ్తుండగా మధ్యలో  ఉత్తరకాశీలో పర్యటించారు. ఆ సమయంలో నేను వాజ్‌పేయీని కలిశాను. ఆయన చనిపోయారని తెలిసి దిగ్భాంత్రికి గురయ్యా. కడసారి చూసేందుకు ఢిల్లీకి వచ్చానని, ఆయన కోసం గంగోత్రి నుంచి గంగాజలం కూడా తీసుకొచ్చాను అని అన్నారు.
తెరాస ఎంపీ నివాళి..
భారతరత్న, మాజీ ప్రధాని వాజ్‌పేయి భౌతికకాయానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటు అని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వాజ్‌పేయితో కలిసి పని చేసిన అనుభవం మరువలేనిది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వాజ్‌పేయి ఎప్పుడూ సానుకూల ఆలోచనతో ఉండేవారన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని జితేందర్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు.
అశ్రునయనాల మధ్య సాగిన అంతిమయాత్ర..
మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్ర అభిమానులు, బీజేపీ కార్యకర్తల అశ్రునయాల మధ్య సాగింది. ఢిల్లీలోని దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని భాజపా ప్రధాన కార్యాలయం నుంచి అంతిమ యాత్ర మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైంది. యమునా నదీ తీరంలోని రాష్టీయ్ర స్మృతి స్థల్‌ వద్ద ప్రభుత్వం లాంఛనాలతో వాజ్‌పేయీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దారి పొడవును భారీ సంఖ్యలో అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర సందర్భంగా రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. అంతిమయాత్ర వెంటే ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా అమరహై
వాజ్‌పేయి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో స్హతి స్థల్‌ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే నెహ్రూ స్మారక స్థలం శాంతి వనం, లాల్‌బహుదూర్‌ శాస్త్రి స్మారకం విజయ్‌ ఘాట్‌ మధ్యలో రాష్టీయ్ర స్మృతి స్థల్‌ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్‌ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి.