రాజయ్యను గెలిపించి కెసిఆర్‌ను సిఎం చేయాలి

అభివృద్ది,సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

రాజయ్య నామినేషన్‌ కార్యక్రమంలో డిప్యూటి సిఎం కడియం

వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండాలంటే మళ్లీ కేసిఆర్‌ సిఎం కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రెండోసారి కేసిఆర్‌ సిఎం కావాలంటే స్టేషన్‌ ఘన్పూర్‌లో రాజయ్య ఎమ్మెల్యేగా గెలువాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలంతా గెలుస్తేనే కేసిఆర్‌ మరోసారి సిఎం అవుతారని అన్నారు. భారీ జనసందోహంతో, ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సహకారంతో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజక వర్గ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య నామినేషన్‌ వేసారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే భారతదేశంలో అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్‌ స్థానంలో ఉందని కడియం శ్రీహరి అన్నారు. కేసిఆర్‌ సమర్థ నాయకత్వంలో ఊహించని అభివృద్ధిని చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఆసరా పెన్షన్లు వెయ్యి రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్లను రెట్టింపు చేసి వచ్చే ప్రభుత్వంలో 2016రూపాయలు ఇస్తామని కేసిఆర్‌ గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ 1500 రూపాయలను 3016 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మన ఇళ్లలో చదువుకుని ఉద్యోగం రాని యువతకు నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ఇస్తామన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరాకి ఇచ్చే 8000 రూపాయలను 10వేల రూపాయలకు పెంచుతున్నారు. వీటితో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, కేసిఆర్‌ కిట్‌, కేజీ టు పీజీలో భాగంగా అనేక గురుకులాలు ఏర్పాటుచేసుకున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గంలో విూ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు ఈ ముగ్గురు నాయకులు అందుబాటులో ఉంటారని డిప్యూటి సిఎం కడియం ప్రకటించారు. డాక్టర్‌ రాజయ్య నిరంతరం విూకుఅందుబాటులో ఉండే వ్యక్తి. రాజన్న అని పిలిస్తే నేనున్నాని వచ్చే వ్యక్తి. విూ కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి. డాక్టర్‌ రాజయ్యను గెలిపించుకునే అవసరం మనందరికి ఉందన్నారు. ఈ నియోజకవర్గంలో నాకు ఎంపీగా 90వేల మెజారిటీ వచ్చింది. రాజయ్యకు కూడా ఈసారి 90వేల మెజారిటీ రావాలన్నారు. డబ్బులు పంచే వారి, బిస్కట్లకు ఎవరు చిక్కరని, మనవాళ్లు ఎవరూ వాటికి ఆశపడరని నాకు నమ్మకం ఉందన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మల్కాపూర్‌ లింగంపల్లి వద్ద భారీ రిజర్వాయర్‌ ను ప్రకటించారు. దీనికి అగ్రిమెంట్లు అయ్యాయి, త్వరలోనే దీనిపనులు ప్రారంభం అవుతాయి. వచ్చే మూడుసంవత్సరాల్లో ఈ రిజర్వాయర్‌ ను పూర్తి చేసి రెండుపంటలకు సాగునీరు ఇచ్చే బాధ్యతను మేం ముగ్గురం తీసుకుంటాం. లింగంపల్లి రిజర్వాయర్‌ పూర్తయితే స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరు వస్తుంది, ఇది మరో కోనసీమ అవుతుందన్నారు. స్టేషన్‌ ఘన్పూర్‌ పారిశ్రామికంగా కూడా అభివృద్ది చెందనుందన్నారు. దేవాదుల కాలువల ద్వారా ప్రతి చెరువును నింపాల్సిన అవసరం ఉంది. డాక్టర్‌ రాజయ్య గెలుపే కడియం శ్రీహరికి విూరిచ్చే గౌరవం అన్నారు. రాజయ్య గెలువడం ద్వారా కేసిఆర్‌ ని సిఎం చేసుకోవడం ద్వారా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు అనైతికంగా కూటమిగా ఏర్పడ్డాయని, తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తో, కోదండరామ్‌

తో పొత్తు ఏ రకంగా సమర్ధించుకుంటారో చెప్పాలని రాజయ్య అన్నారు. మహాకూటమిలో టికెట్‌ ప్రకటించడంతో కొందరు మాయమవుతారు. ఓడిపోయిన తర్వాత పోటీ చేసిన వారు కూడా కనిపించరు. వారికి డిపాజిట్‌ కూడా రాదు. కాబట్టి స్టేషన్‌ ఘన్పూర్‌ లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి కేసిఆర్‌ ను మళ్లీ సిఎం చేయాలని కోరారు. ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ గులాబీ జెండా కింద పనిచేయాలి. మహాకూటమిని గూబ గుయ్యమనేలా ఓడించాలన్నారు. మహాకూటమిలో ఇంకా ఎవరు కూడా జెండా పట్టని విధంగా ఆ కూటమికి బుద్ది చెప్పాలన్నారు.