రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల శ్రద్దాంజలి
ఢిల్లీలో నివాళి అర్పించిన సోనియా,రాహుల్‌,ప్రియాంక
న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి): మాజీ ప్రధాని, దివంగత  రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించాయి. రాజీవ్‌ సమాధి వద్ద  ఆయన సతీమణి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజీవ్‌కు నివాళులర్పించారు. దిల్లీలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రాంతమైన వీర్‌ భూమి వద్ద సోనియాతో పాటు ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్‌ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. అందరినీ గౌరవించడం, ప్రేమించడమే ఆయన తనకు నేర్పించారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులామ్‌ నబీ అజాద్‌, భూపేందర్‌ సింగ్‌ హుడా, అహ్మద్‌ పటేల్‌ తదితరులు రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా పార్లమెంటు హాలులో నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు రాజీవ్‌ గాంధీ నిలువెత్తు పటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. రాజీవ్‌ సతీమణి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, సుబ్రహ్మణ్య స్వామి, గులాం నబీ ఆజాద్‌, ఇతర ఎంపీలు రాజీవ్‌కు నివాళులర్పించారు.దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలను నేతలు కొనియాడారు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో రాజీవ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో టీపీసీసీ ఆధ్వర్యంలో  గాంధీ భవన్‌లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు.