రానున్నది ఎన్నికల బడ్జెట్!

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఏడాది జరుగనున్న ఎనిమిది రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వ్యవసాయం, రైతు కార్మికుల సంక్షేమం, నీటి పారుదల ప్రాజెక్టులు తదితర వ్యవసాయ సంబంధ, కార్మిక సంబంధ అంశాలకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీనాడు లోక్‌సభలో ప్రతిపాదించే వార్షిక బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలోనే మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్నాటక రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరుగవలసి ఉన్నది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో రావచ్చు. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌డ్‌తోపాటు మిజోరం శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం, తాము అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో నాలుగోసారి అధికారంలోకి రావటం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకే ఇరువురు నాయకులు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయావకాశాలపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. అమిత్ షా ఇప్పటికే కర్నాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రాల నుండి పార్టీ శాఖలు అందజేస్తున్న నివేదికలు, సమీక్షల ఆధారంగా ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకోవటంతోపాటు పార్టీ విజయానికి తోడ్పడే అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరుణ్ జైట్లీ ఈ అంశంపై నరేంద్ర మోదీ, అమిత్ షాతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతితక్కువ మెజారిటీతో విజయం సాధించటం పార్టీ అధినాయకత్వం కళ్లు తెరిపించిందని అంటున్నారు. పాతనోట్ల రద్దు, జీఎస్‌టీటి అమలు వంటి అంశాలు ఆ ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రభావం చూపాయని బీజేపీ నాయకులు అంచనా వేశారు. వాస్తవానికి ఈ రెండు ముఖ్యమైన అంశాలకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు బీజేపీకి మెజారిటీ రాకుండా చేశాయి. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించటంవల్లే గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ చావుతప్పి కన్ను లొట్టపోయిందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ సంవత్సరం మార్చి, ఎప్రిల్‌లలో మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, కర్నాటక శాసనసభల ఎన్నికలు జరిగితే సంవత్సరాంతంలో మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసనసభల ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మూడు టర్ములనుండి అధికారం చెలాయిస్తోంది. రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌లో నెలకొన్న పరిస్థితుల లాంటివే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నెలకొంటే తమ పరిస్థితి అంతే సంగతులని బీజేపీ అధినాయకత్వం భయపడుతోంది. గుజరాత్ తమ స్వంత రాష్ట్రం, అందులో ఓడిపోతే ప్రతిష్ఠ బాగా దెబ్బతింటుందని భయపడిన నరేంద్ర మోదీ, అమిత్ షా కాలికి బలపం కట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. గుజరాత్‌లో చేసిన స్థాయిలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో
ఎన్నికల ప్రచారం చేసేందుకు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలకు సంబందించిన పథకాలను పొందుపరచటం, వ్యవసాయం, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పథకాలకు పెద్దపీట వేయటంద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలని మోదీ, షా, జైట్లీ త్రయం వ్యూహం పన్నుతున్నట్లు తెలిసింది. వ్యవసాయ రంగం, కార్మిక రంగం, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పథకాలను బడ్జెట్‌లో పొందుపరుస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల రైతుల ఆగ్రహాన్ని తగ్గించే దిశగా మోదీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి జీఎస్‌టీ ప్రభావాన్ని కూడా బాగా తగ్గించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.