రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి

– ఎన్డీయే అవినీతిని బయటపెట్టండి
– కేరళలో సహాయక చర్యల్లో నేతలు పాల్గొనాలి
– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
– కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల నేతలతో రాహుల్‌ కీలక సమావేశం
– కేరళ వరద బాధితులను ఆదుకొనేందుకు కాంగ్రెస్‌ నేతల విరాళం
న్యూఢిల్లీ, ఆగస్టు18(జ‌నం సాక్షి) : రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్రం పాల్పడుతున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చి ఎన్డీయే పాలన తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. రాహుల్‌ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో శనివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, రాష్టాల్ర ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వం రాఫెల్‌ విమానాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినందన్నారు. దీనిపై పార్లమెంట్‌ సమావేశాల్లో నిలదీసినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా భాజపా ప్రభుత్వం తీరును ఎండగట్టాలని రాహుల్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు కుంభకోణాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతుందన్నారు. నోట్లరద్దు, డీ మానిటైజేషన్‌ సమయంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. కేంద్రం పాలన తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, దీనిని నేతలు సద్వినియోగం చేసుకొని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయంగా మలచుకోవాలని రాహుల్‌ సూచించారు. అదేవిధంగా కేరళలో వరద ఉధృతిపై సమావేశంలో చర్చించారు. కేరళలో సహాయక చర్యలపై కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. కేరళలో వరద బాధితులకు సహాయార్థం నెల రోజుల వేతనాన్ని కాంగ్రెస్‌ నేతలు అందించాలని రాహుల్‌ సూచించారు. సమావేశం అనంతరం విూడియాతో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్ద దోపిడీ దారుడని మండిపడ్డారు. రాఫెల్‌ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి రిలయన్స్‌ కంపెనీకి దోచిపెట్టారని అన్నారు. బీజేపీ అవినీతిని బయటపెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాఫెల్‌ కుంభకోణంపై అక్టోబర్‌లో కరపత్రాలను పంచుతామని రఘువీరా తెలిపారు.
కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి – రాహుల్‌గాంధీ
అంతకు ముందు కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ‘డియర్‌ పీఎం.. కేరళ వరదలను తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేరళలో ప్రజల పరిస్థితి, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు తక్షణ సాయం కింద రూ. 500కోట్లు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ నేడు ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలో వరదల పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం కోచి నేవీ బేస్‌ నుంచి విహంగ వీక్షణం చేపట్టారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర అధికారులతో సవిూక్ష జరిపిన ప్రధాని మోదీ కేరళకు రూ. 500కోట్ల సాయం ప్రకటించారు. అంతేగాక.. వరద బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించారు.
కాంగ్రెస్‌ నేతల విరాళం..
కేరళ ప్రజలకు ఆర్థికసాయం అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకొచ్చింది. ఈ విషయమై శనివారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు సమావేశమై విరాళాలపై నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నెల వేతనాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నారు.