రామమందిరం నిర్మాణం ఇప్పట్లో కాదా?

న్యూఢిల్లీ:
‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడ్డుగా ఉన్న అవరోధాలను క్రమంగా అధిగమించి ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు పరిధిలోఉన్న ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? అన్న అంశంపై అప్పుడే హిందుత్వ వాదుల్లో చర్చ ప్రారంభమైంది.

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని బలంగా కోరుకుంటున్న హిందూ నాయకుల్లో ఆధిత్యనాథ్‌ ఒకరనే విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, గతంలో రామమందిరం ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన దిగ్విజయ్‌నాథ్, అవైద్యనాథ్‌ లాంటి కరడుగట్టిన నాయకుడేమీ కాదు. రామమందిరం నిర్మాణ అంశాన్ని చేతనావస్థలో ఉంచేందుకు, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఎన్నికల్లో బీజీపీ కాకుండా ఎస్పీ, బీఎస్పీలు విజయం సాధించినట్లయితే అయోధ్య శ్మశానంగా మారుతుందని కూడా ఆయన ఓటర్లను హెచ్చరించారు.

గోరక్‌పూర్‌లోని గోరక్షకపీఠం మందిరానికి 1935 నుంచి 1969వరకు మహంత్‌గా పనిచేసిన దిగ్విజయ్‌నాథ్‌ మొట్టమొదటగా అయోధ్యలోని బాబ్రీ మసీదు మొత్తాన్ని రామమందిరంగా మార్చాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఆ తర్వాత 1949, డిసెంబర్‌ 22వ తేదీ రాత్రి బాబ్రీ మసీదులోకి వెళ్లి రాముడి విగ్రహాన్ని అనూహ్యంగా ప్రతిష్టించారు. అప్పటి హిందూ మహాసభ ప్రముఖ నాయకుల్లో ఒకరైన హిందూ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్, ఆయన అనుచరుల అండతో ఆయన ఆయన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రహస్యంగా గావించారు.

దిగ్విజయ్‌నాథ్‌ మరణానంతరం ఆయన శిష్యుడు అవైద్యనాథ్‌ (ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్‌ గురువు) భారతీయ జనతా పార్టీ అండతో రామ మందిర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది చివరకు 1992, డిసెంబర్‌ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది. 1989లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో విశ్వహిందూ పరిషద్‌ ఆధ్వర్యంలో జరిగిన సాధువుల సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా అవైద్యనాథ్‌ రామ మందిరం ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. ‘అనవసరమైన సంఘర్షణను నివారించేందుకు మరోచోట రామాలయాన్ని నిర్మించుకోవాల్సిందిగా ముస్లిం పెద్దలు సూచించడం ఎలా ఉందంటే రావణుడితో యుద్ధాన్ని నివారించేందుకు మరో సీతను వెతుక్కోవాల్సిందిగా రాముడికి సూచించినట్లుగా ఉంది’ అంటూ ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు సాధువులకు స్ఫూర్తినిచ్చాయి. మహంత్‌ అవైద్యనాథ్‌ సహా ఉమా భారతి, సాధ్వీ రితంబరి, పరమహంస రామచందర్‌ దాస్, ఆచార్య ధర్మేంధ్ర దేవ్, బీఎల్‌ శర్మ తదితరులు ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా బాబ్రీ మసీదు విధ్వంసానకి కారణమయ్యారంటూ లిబర్హాన్‌ కమిషన్‌ తప్పుపట్టినా వారికి ఎలాంటి శిక్షలు పడలేదు.

2014లో అవైద్యనాథ్‌ మరణించగా, ఆయన రెండు దశాబ్దాల ముందే, అంటే 1994లోనే తన వారుసుడిగా యోగి ఆధిత్యనాథ్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆయన నేతత్వంలో రామ మందిరం నిర్మాణం ఊపందుకుంటుందని హిందూత్వవాదులు భావిస్తున్నారు. అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న బీజేపీ రామ మందిరం జోలికి వెళ్లే అవకాశం లేదు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందున వెళ్లాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. కోర్టు కేసులు ముందుగా పరిష్కారం కావాలంటూ కాలయాపన చేసి, 2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల నాటికి రామ మందిరం నిర్మాణ అంశాన్ని ప్రధాన డిమాండ్‌గా ముందుకు తీసుకొస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.