రాయుడూ బౌలింగ్‌ చేయొద్దు.. 

– నిషేధం విధించిన ఐసీసీ
న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) : అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్‌ వేయకుండా అంబటి రాయుడిపై ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌) నిషేధం విధించింది. ఆస్టేల్రియాతో జరిగిన తొలివన్డేలో రాయుడు బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయం ఐసీసీకి చేరింది. వెంటనే స్పందించిన క్రికెట్‌ కౌన్సిల్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ కొనసాగించాలంటే 14రోజుల వ్యవధిలో నిర్దేశించిన టెస్టుకి హాజరు కావాలని రాయుణ్ని ఆదేశించింది. కానీ గడువులోగా రాయుడు బౌలింగ్‌ యాక్షన్‌ టెస్టుకు హాజరుకాలేదు. దీంతో బౌలింగ్‌ చేసేందుకు వీల్లేకుండా ఐసీసీ రాయుడిపై సస్పెన్షన్‌ విధించింది. ఐసీసీ నిబంధనల్లో 4.2 క్లాజ్‌ ప్రకారం సస్పెన్షన్‌ వెంటనే అమల్లోకి వస్తుందని కౌన్సిల్‌ తెలిపింది. బౌలింగ్‌ యాక్షన్‌ టెస్టుకి హాజరై మోచేతిని నిబంధనలకు అనుగుణంగానే వంచుతాన్నడాని రూఢీ అయ్యేంత వరకూ రాయుడిపై వేటు కొనసాగనుంది. దేశవాళీ క్రికెట్లో మాత్రం బీసీసీఐ అనుమతితో అంబటి రాయుడు బౌలింగ్‌ చేయొచ్చని ఐసీసీ వివరణ ఇచ్చింది. తెలుగు క్రికెటర్‌ అయిన రాయుడు టీమిండియా మిడిలాడర్డర్లో కీలకంగా మారాడు. అంబటి రాయుడు చాలా అరుదుగా బౌలింగ్‌ చేస్తుంటాడు. 49 వన్డేల్లో ఇప్పటి వరకూ 121 బంతులు మాత్రమే వేసిన రాయుడు.. మూడు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 9సార్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన అంబటి.. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దిగలేదు.