రాహుల్‌తో ట్విట్టర్‌ సిఇవో భేటీ

నకిలీ వార్తల ప్రచారంపై చెక్‌కు హావిూ

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): ప్రముఖ సోషల్‌విూడియా సంస్థ ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సీ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. భారత పర్యటనలో ఉన్న జాక్‌ సోమవారం రాహుల్‌తో సమావేశమయ్యారు. ట్విటర్‌లో నకిలీ వార్తలను వ్యాప్తిని అరికట్టే అంశంపై ఇరువురు చర్చించారు.

‘ట్విటర్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీతో ఈ ఉదయం సమావేశమయ్యా. ప్రపంచవ్యాప్తంగా సంభాషణ వేదికల్లో ట్విటర్‌ ఆధిపత్య స్థాయికి ఎదిగింది. ఈ సంభాషణలు మరింత ఉత్తమంగా ఉండేందుకు, ట్విటర్‌లో నకిలీ వార్తలను అరికట్టేందుకు తీసుకుంటున్న పలు చర్యలను జాక్‌ వివరించారు’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాక్‌తో కలిసి దిగిన సెల్ఫీని రాహుల్‌ పోస్టు చేశారు. గతవారం భారత్‌కు వచ్చిన జాక్‌ డోర్సీ గత శుక్రవారం ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. నేడు రాహుల్‌ను కలిసి అనంతరం దిల్లీలోని ఐఐటీ ప్రాంగణానికి వెళ్లి అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జాక్‌ సమాధానాలు చెప్పారు. పర్యటనలో భాగంగా జాక్‌.. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కూడా కలవనున్నారు.