రాహుల్‌ వైఫల్యాన్ని కాంగ్రెస్‌ ఒప్పుకుంది

– అందుకే ప్రియాంక రాజకీయ ప్రవేశం?
– భాజపా నేత సంబిత్‌ పత్రా
న్యూఢిల్లీ, జనవరి23(జ‌నంసాక్షి) : రాహుల్‌ వైఫల్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకుందని, దీంతో రాహుల్‌ వల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని గుర్తించి ప్రియాంకాను రాజకీయ ప్రవేశం చేయించిందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పత్రా అన్నారు. ప్రియాంకా గాంధీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ కాంగ్రెస్‌ ప్రకటన జారీ చేయగానే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు విమర్శల పర్వానికి తెరలేపారు. కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రియాంక రాజకీయ ప్రవేశం నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించడం 2019 సార్వత్రిక ఎన్నికలలో విూకు సమస్యలు సృష్టిస్తుందా అన్న విలేకరుల స్రశ్నకు బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్‌ పత్రా బీజేపీకి ప్రియాంక రాజకీయ ప్రవేశం అసలు సవాలే కాదని బదులిచ్చారు. ఇది ఊహించిన పరిణామమేనని అన్నారు. ఆ పార్టీ చరిత్ర మొత్తం కుటుంబ రాజకీయమేనని విమర్శించారు. ప్రియాంక రాజకీయ ప్రవేశం రాహుల్‌ గాంధీ వైఫల్యానికి సంకేతమని సంబిత్‌ పత్రా అన్నారు. యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ మాట్లాడుతూ ప్రియాంక ప్రవేశం ఉత్తర ప్రదేశ్‌ పై కానీ, దేశ రాజకీయాలపై కానీ ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలనే తీసుకుంటే ప్రియాంక గాంధీ మొత్తం 46 స్థానాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారనీ, అయితే ఆ పార్టీ కేవలం రెండు స్థానాలలో మాత్రమే విజయం సాధించిందని గుర్తు చేశారు. ఇక బీజేపీ నేత సుప్రియా బాబుల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన ప్రియాంకకు అభినందనలు తెలిపారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారని చాలా కాలంగా అనుకుంటున్నదేనని పేర్కొన్నారు. చివరికి అది ఈ రోజు వాస్తవరూపం దాల్చిందని పేర్కొన్నారు.