రికార్డు మెజార్టీతో పసునూరి గెలుపు

yvvgro4vవరంగల్ : జిల్లా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి కడియం..ఎంపీ వినోద్ కుమార్ లు పేర్కొన్నారు. లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికకు సోమవారం కౌంటింగ్ జరిగింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మంత్రి కడియం మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం..అన్ని రాజకీయ పార్టీల డిపాజిట్లు గల్లంతు కావడం ప్రజలకు..కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని తెలియచేస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో తాము రెండు విషయాలను ప్రధానంగా చెప్పడం జరిగిందని, ఈ తీర్పు పాలనకు రెఫరెండమని చెప్పడం జరిగిందన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వరంగల్ జిల్లా ప్రజలు తీర్పు ద్వారా సమాధానం చెబుతారని ఆనాడు చెప్పడం జరిగిందని అదే జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించడం జరిగిందన్నారు. తప్పులు చేసి ఉంటే శిక్ష వేయాలని, ప్రతిపక్షాలవి అవాస్తవాలు అయితే వారికి శిక్ష వేయాలని సీఎం కేసీఆర్ పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలాగా ప్రజలు శిక్ష వేశారని, పసునూరి గెలుపు ద్వారా
జిల్లా నాయకుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి పాటు పడుతామని, నీతి నిజాయితీతో పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఫలితాల అనంతరం విపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది పోయి ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

అండదండగా ఉంటా – పసునూరి..
జిల్లా ప్రజలకు తాను అండదండగా ఉంటానని ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ పేర్కొన్నారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల అధికారులనుండి ఆయన అధికారిక పత్రాలను అందుకున్నారు. తాను ప్రజలకు, కార్యకర్తలకు అండదండలుగా ఉంటానని, మంచిపేరు తెస్తానని తెలిపారు. అలాగే నీతివంతమైన రాజకీయాలు చేస్తాననని, భారీ మెజార్టీ సాధించడం వెనుక కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

ఆనాడు చెప్పిందే జరిగింది – వినోద్..
ఎన్నికల ప్రచారం చివరి రోజు తాను ఏదైతే చెప్పానో అదే ఈ రోజు జరిగిందని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పసునూరి గెలుపుకు సహకరించిన వారికి, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అమలు జరుగుతున్నాయని, కేసీఆర్ రూపొందించిన పథకాలు రానున్న రోజుల్లో అమలవుతాయని ప్రజలు విశ్వసించారని తెలిపారు. ఇదే తీర్పు 2019 ఎన్నికల్లో వస్తుందని ఎంపీ వినోద్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.