రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు పచ్చజెండా

– వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేత

– కేబినేట్‌ నిర్ణయాలను ప్రశ్నించలేరు

– హైకోర్టులో ఎజి వాదన

హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి): ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రైవేటీకరణపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ప్రభుత్వ విధానాలకు లైన్‌క్లీయర్‌ అయింది. గతంలో ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన కోర్టు.. ఇవాళ వాదప్రతివాదనలు విన్న తర్వాత ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేబినెట్‌ నిర్ణయాలను సవాల్‌ చేయలేరని ఏజీ వాదించారు. పలు రాష్టాల్లో కేబినెట్‌ నిర్ణయాలను.. సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన సందర్భాలు ఉన్నాయని పిటిషనర్‌ లాయర్‌ గుర్తుచేశారు. ఆర్టీసీపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఏజీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈనిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా మూడు సుప్రీంకోర్టు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. రూట్ల ప్రైవేటీకరణ పక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్‌ తీర్మానంలో ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం వేరు.. అథారిటీ వేరని, ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ పక్రియ నిర్వహిస్తారని ఏజీ వివరించారు. ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని సూచించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. రవాణశాఖ ముఖ్య కార్యదర్శి పక్రియను నిర్వహిస్తారని ఏజీ బదులిచ్చారు. కేబినెట్‌ తీర్మానంలో అలా లేదని… ప్రైవేటీకరణ అధికారం అథారిటీకి ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది.