రూ. 1,82,017కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

– సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత
– నీటి పారుదల రంగానికి రూ.22500 కోట్లు కేటాయింపు
–  వ్యవసాయానికి రూ.20,107కోట్ల కేటాయింపు
దేశంలో చర్చకు కేంద్ర బిందువయ్యాం
– తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి సాధించాం
– విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి వెలుగులు వైపు పయణించాం
– ఇదే స్ఫూర్తి వచ్చే ఐదేళ్ల పాలన సాగిస్తాం
– అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌
– 2018 డిసెంబర్‌ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామన్న కేసీఆర్‌
– ఇందుకోసం రూ.6వేల కోట్ల కేటాయింపు
– ఏప్రిల్‌ చివరి నాటికి ఇంటింటికి నల్లానీళ్లిస్తాం
– ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని, ఫలితంగా దేశ వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర బిందువైందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న క్రమంలో అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు, మూలధన వ్యయం రూ.32,815కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు గా ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి నమూనాల గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని  అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. విద్యుత్‌ సమస్యలు పరిష్కరించి చీకటి నుంచి వెలుగుల వైపు పయనించామని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని, తెలంగాణ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా చర్చించు కుంటున్నారన్నారు. మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసం చాటారు. 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 10.6 శాతంగా నమోదైందని కేసీఆర్‌ వివరించారు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంత వృద్ధిరేటు దేశ సగటుకన్నా తక్కువగా ఉండేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్లు పెరిగిందని కేసీఆర్‌ తెలిపారు. మరోసారి ప్రజలు తెరాసకు అధికారం ఇచ్చి ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటారన్నారు. పేదల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచుతున్నామని కేసీఆర్‌, దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచుతున్నామని, వృద్ధాప్య పింఛన్‌కు కనీస
వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  అదేవిధంగా విద్యుత్‌ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించిందని కేసీఆర్‌ తెలిపారు. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్లు నిర్మాణం జరుగుతోందన్నారు.  దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో మనరాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని అన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని,  విద్యుత్‌ వినియోగం వృద్ధిరేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణమన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.  మరో రెండు నెలల్లో ఇంటింటింకి నల్లాద్వారా మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. నిరుపేదలకు గృహ నిర్మాణపథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  రెండు పడల గదుల ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు 2,72,763 ఇళ్లు కట్టుకునేవారికి ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 340 కిలోవిూటర్ల రీజనల్‌ రింగ్‌రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని,  ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నీటి పారుదల రంగానికి రూ.22500 కోట్లు ..
సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సాగునీటి రంగానికి తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. తొలి ఐదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను చాలా వరకు పూర్తి చేయగలిగింది. ఇప్పుడు మరో ఐదేళ్లు కూడా సాగునీటి ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఏడాదికిగాను తాత్కాలిక బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, 90శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్‌ తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులను కూడా సంపాదించగలిగామని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నీటిని ఈ వర్షాకాలంలోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా 20వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. కాలువల పునరుద్ధరణ ద్వారా చెరువులకు పునర్‌ వైభవం తేనున్నట్లు స్పష్టం చేశారు.
2018 డిసెంబర్‌ 11లోపు తీసుకున్న రుణాలుమాఫీ ..
టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల రుణమాఫీ అంశంలో ఇప్పటి వరకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. తాజాగా రైతు రుణాలు మాఫీపై బడ్జెట్‌లో సీఎం రైతులకు స్పష్టత ఇచ్చారు. 2018 డిసెంబర్‌ 11లోపు రూ. లక్ష తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా రుణమాఫీ చేయనున్నారు. ఇందుకోసం రైతు రుణమాఫీ కోసం రూ. 6వేల కోట్లును కేటాయించారు. మొత్తం వ్యవసాయానికి రూ.20,107కోట్ల కేటాయింపులు చేశారు. అదేవిధంగా రైతుబీమా కోసం రూ.650కోట్లు, రైతుబంధు సాయం ఎకరానికి రూ.10వేలు, ఇందు కోసం రూ.12వేల కోట్లు
కేటాయింపు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు.
ఆసరా పెన్షన్‌ల కోసం రూ.12,067కోట్లు..
రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల బాధితులు, నేత, గీతా కార్మికులు, ఎయిడ్స్‌ వాధిగ్రస్థులకు ఇచ్చే నెలసరి పెన్షన్‌ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్‌ రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య పెన్షన్‌కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెరిగిన పెన్షన్‌ అందిస్తామని ప్రకటించారు. ఓటాన్‌ అకౌండ్‌ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 12 వేల 67 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహయులుగా మార్చిందన్నారు. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షను కింద కొన్నాళ్లు రూ. 75 మరికొన్నాళ్‌ల్లు రూ. 200 మాత్రమే విదిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్లు చెప్పుకున్నాయన్నారు. ప్రభుత్వాలు విదిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం కూడా తీర్చుకునేందుకు సరిపోయేది కాదన్నారు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులను అందరిని ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1000కి.. దివ్యాంగుల పెన్షన్లు రూ. 1500కి పెంచినట్లు వెల్లడించారు. తాన విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నట్లు.. బీడీలు చుట్టే తల్లుల దుర్భర వేదనను దగ్గర నుంచి గమనించినట్లు చెప్పారు. అందుకే వారి వేదనను ఛేదించాలని ఎక్కడా ఎవరూ డిమాండ్‌ చేయకుండానే ప్రతి నెల రూ. వెయ్యిని జీవనభృతిగా ప్రకటించినట్లు తెలిపారు. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాట్లు చెప్పనలవికావని కేసీఆర్‌ అన్నారు. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు రూ. 1000 ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి కొండంత అండగా మారిందన్నారు. అదేవిధంగా బోధకాల వ్యాధితో బాధపడే వారి బాధలు కూడా మానవీయ కోణంలో స్పందించి ప్రభుత్వం వారిని ఆసరా పింఛన్ల పరిధిలోకి తెచ్చిందన్నారు. నిస్సాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయని.. ఊపిరులు నిలబడుతున్నాయన్నారు. ఎక్కడా మధ్య దళారులు ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందుతున్న ఈ పెన్షన్లు పేదల జీవితాల్లో సంతోషాలు నింపుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు అందుకుంటున్నవారు కేసీఆర్‌ మమ్మల్ని పెద్ద కొడుకులా ఆదుకుంటారని, దేవుడినిచ్చిన అన్నా అని దీవించడం తన రాజకీయ జీవితానికి గొప్ప సార్ధకతగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆసరా పెన్షన్లు తన హృదాయానికి దగ్గరైన కార్యక్రమమన్నారు. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హావిూ ఇచ్చామని, ఇచ్చిన హావిూ పెన్షన్లను రెట్టింపు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
సంక్షేమానికి పెద్దపీట..
శుక్రవారం అసెంబ్లీ కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు,  నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు,  ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు,  ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు, బియ్యం రాయితీకి రూ.2,774కోట్లు,  ఎంబీసీ కార్పొరేషన్‌కు
రూ.1000 కోట్లు కేటాయించారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించారు. వైద్య ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు,  పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి రూ.3,256కోట్లు, ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు, 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు కేటాయించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు,  టీఎస్‌ఐపాస్‌ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు, 8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేసీఆర్‌ తెలిపారు.