రెండు ఎంపి స్థానాలల్లో తిరుగులేని టిఆర్‌ఎస్‌

పెద్దపల్లి సీటు వివేక్‌కు ఖాయమంటున్న నేతలు

ఆదిలాబాద్‌ స్థానం మళ్లీ గోడం నగేశ్‌కు దక్కేనా?

జిల్లాలో మారుతున్న రాజకీయం

రాజకీయ పదవిపై ఆశగా వేణుగోపాలాచారి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో అధికార టిఆర్‌ఎస్‌కు ఎదురులేదు. గతంలో ఈ రెండు స్థానాలు టిఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి. తాజా పరిస్థితులు కూడా టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఆదిలాబాద్‌,పెద్దపల్లి ఎంపి స్థానాల్లో గెలుపు నల్లేరువిూద నడకే కానుంది. అయితే అభ్యర్థులే ఎవరన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుత ఆదిలాబాద్‌ ఎంపి గోడం నగేశ్‌ అసెంబ్లీ ఛాన్స్‌ దక్కక పోవడంతో తిరిగి ఎంపిగా పోటీకి సిద్దంగా ఉన్నారు. పెద్దపల్లి

నుంచి ఎంపికైన బాల్క సుమన్‌ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో పెద్దపల్లిపై వివేక భరోసాతో ఉన్నారు.

ఆదిలాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఇప్పుడు ఎవరు అభ్యర్థులు కానున్నారన్న చర్చ సాగుతోంది. గోడం నగేశ్‌ అసెంబ్లీపై మక్కువ పెంచుకున్నా చివరి నిమిషంలో అది సఫలం కాలేదు. ఎంపీగా ఉండడం కన్నా ఎమ్మెల్యేగా కొనసాగితేనే మంచిదనే ధోరణితో గోడం నగేశ్‌ తన పాత నియోజక

వర్గంపై దృష్టి సారించారు. బాల్క సుమన్‌ శాసనసభకు ఎన్నిక కావడంతో పెద్దపల్లిపై వివేక్‌కు లైన్‌ క్లీయర్‌ అయ్యింది. దీంతో నగేశ్‌ మళ్లీ లోక్‌సభకు పోటీ చేయాల్సిఉంటుంది. అయితే నగేశ్‌కే ఇస్తారా ఇతరులను ఆలోచిస్తారా అన్నది చూడాలి. ఎన్నికలు దగ్గర పడడంతో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజకీయం రసకందాయంలో పడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉండి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో వివేక్‌ అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బాల్క సుమన్‌ పెద్దపల్లి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాల్క సుమన్‌ విజయం సాధించారు. కాగా గతేడాది మాజీ ఎంపీ జి.వివేక్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వివేక్‌ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు నియోజకవర్గంలో కార్యక్రమాలు కూడా జోరుగా చేపట్టారు. అదే సమయంలో ఎంపీ సుమన్‌ అసెంబ్లికి ఎన్నికయ్యారు.అయితే వివేక్‌ ముందస్తు ఒప్పందంతోనే టీఆర్‌ఎస్‌లో చేరారనే ప్రచారం ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌ లోక్‌సభపై దృష్టి పెట్టారని సమాచారం. ఆయన సతీమణి రేఖా నాయక్‌ ఇప్పటికే ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్‌ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించిన శ్యాం నాయక్‌ గత ఎన్నికల్లోనే టిక్కెట్టు లభిస్తుందని భావించారు. ప్రభుత్వ అధికారిగా ఉమ్మడి జిల్లాతో ఉన్న అనుబంధం తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రేఖానాయక్‌ ఎమ్మెల్యేగా ఉండడం, ఆయన సోదరుడు రాంనాయక్‌ సిర్పూరు(టి) జెడ్‌పీటీసీగా కొనసాగుతుండడం కలిసివచ్చే అంశం. మొత్తంగా ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో గెలుపు అవకాశాలను సిఎం కెసిఆర్‌ ఇప్పటి నుంచే బేరీజు వేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న పక్కా సమాచారంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రెండు పార్లమెంట్‌ సీట్లు అవలీలగా గెల్చుకోవడం సునాయాసం కానుంది. ఇకపోతే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేకుండా పోవడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల నుంచి మొన్నటి ఎన్నికల్లో అంతా పాతవారే పోటీ చేసి నెగ్గారు. ఆసిఫాబాద్‌ నుంచి మాత్రం కోవ లక్ష్మి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అధికార టిఆర్‌ఎస్‌కు ఇక్కడ ఒక్కచోటే ఓటమి ఎదురయ్యింది. ఆశావహులు పెరగడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు టిఆర్‌ఎస్‌లో ఉండడం కారణంగా వీరందరిని ఇప్పుడు వేర్వేరు పదవుల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. కోవ లక్ష్మికి కూడా ఏదైనా పదవి వస్తుందన్న ఆశలో ఉన్నారు. దీనికితోడు ఢిల్లీలో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆయన రాజ్యసభ దక్కుతుందని గత కొంతకాలంగా ఆశగా ఉన్నారు. కనీసం ఖాళీ అయినఎమ్మెల్సీ స్థానంలో తనకు స్థానం దక్కుతుందా అన్న ఆశలో ఉన్నారు.ఈ సారైనా తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తే ఇక భవిష్యత్‌లో మరోమారు అవకాశం కోసం చూడకుండా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సిఎం కెసిఆర్‌ ఆయనకు ఎంపి పదవి ఇవ్వడం అన్నదానిపై ఇంతవరకు చూచాయగా కూడా ప్రకటన చేయలేదు. దీంతో ఆయన ఢిల్లీలో అధికార ప్రతినిధిగానే కొనసాగుతున్నారు. ప్రస్తుత ముథోల్‌ నుంచి విఠల్‌ రెడ్డి, నిర్మల్‌ నుంచి ఇంద్రకరణ్‌ రెడ్డి గగెలవడంతో ఇక భవిష్యత్‌లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇతర పార్టీల్లో పోటీ చేసిన వారిద్దరు టిఆర్‌ఎస్‌లో చేరడంతో మళ్లీ వారికే మళ్లీ టిక్కెట్లు రావడం, గెలుపొందడం జరిగింది.ఈ దశలో వేణుగోపాలాచారికి నియోజకవర్గం అన్నది లేకుండా పోయింది. దీంతో ఆయనకు రాజ్యసభ లేదా, నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులే తప్ప మరో అవకాశం లేదు. రాజ్యసభకు ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఖాళీలు కూడా లేవు. కాబట్టి ఆయన ఎమ్మెల్సీ కోసం గట్టిగా ప్రయత్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది.