రెండు జలాశయాలను నిర్మిద్దాం!

og4qemik

హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మరో రెండు జలాశయాలను నిర్మించాలని నిర్ణయించింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలన్నింటికీ ఇంటింటికీ నల్లా నీరు అందించాలని సీఎం కేసీఆర్ గట్టి సంకల్పంతో ఉన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో ప్రజలకు, పరిశ్రమలకు నీటి కొరత మాట రాకుండా పుష్కలంగా నీరు అందించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. దీనికోసం కృష్ణా, గోదావరి నదుల ద్వారా తరలించే నీటిని నిల్వచేయడానికి ప్రస్తుతం ఉన్న జలాశయాల సామర్థ్యం సరిపోయే అవకాశం లేదు. దీంతో మరో రెండు కొత్త జలాశయాలను నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు స్థల ఎంపికకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 29న జలమండలి అధికారులతో మున్సిపల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ ఆధ్వర్యంలో అధికారులు చర్చించారు.

సీఎం కేసీఆర్ ఆలోచన ప్రకారం ఒక్కో జలాశయంలో 10 టీఎంసీల నీరు నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో రెండు జలాశయాలు నిర్మించాలంటే సుమారు 5వేల ఎకరాలు అవసరమని అంచనా వేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఈ భూమిని ఎంపిక చేసేందుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో పాటు డైరెక్టర్ ప్రాజెక్టు, అపరేషన్, టెక్నికల్, రెవెన్యూలతో కలిపి ఒక కమిటీని జలమండలి నియమించింది. అనువైన స్థలాలను కమిటీ ఎంపిక చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆ స్థలాలు పరిశీలించి తుది నిర్ణయం చేస్తారు. ఈ రెండు జలాశయాల్లో ఒకటి గోదావరి జలాలు నిల్వ చేయడానికి, మరొకటి కృష్ణాజలాలకు వినియోగిస్తారు. గోదావరి జలాశయాన్ని మెదక్ జిల్లా సరిహద్దు, కృష్ణా జలాశయాన్ని నగర శివారులో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రధానంగా కొండల మధ్య లోయల వంటి ప్రాంతమైతే అటవీ ప్రాంతానికి జంతువులకు, ఇరిగేషన్‌కు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. అటవీ ప్రాంతాలకే ప్రథమ ప్రాథామ్యమిస్తున్నారు. వచ్చే 30 సంవత్సరాల జనాభా అవసరాలను తీర్చేందుకు తగినట్టుగా ఈ జలాశయాలకు రూపకల్పన చేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి ప్రస్తుతం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు ఉన్నాయి. ఈ రెండు జలాశయాలను సుమారు 75 సంవత్సరాల క్రితం నిజాం రాజులు నిర్మించారు. 1922, 1927 సంవత్సరంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నిర్మాణం జరిగింది. 737 చ.కి.మీ విస్తీర్ణంలో 3.9 టీఎంసీల సామర్థ్యంతో ఉస్మాన్‌సాగర్, 1131 చ.కి.మీ విస్తీర్ణంలో 2.96 టీఎంసీల సామర్థ్యంతో హిమాయత్‌సాగర్‌లను నిర్మించారు. అప్పుడు నిర్మించిన జలాశయాలే ఇప్పటికీ నగరంలోని ప్రజల దాహార్తిని తీరుస్తూ చరిత్రలో నిలిచిపోయాయి. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా ఆ రెండు జలాశయాలను పట్టించుకోలేదు. దీంతో ఈ జలాశయాలు ప్రతియేటా అడుగంటుతుండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకాలం తర్వాత రెట్టింపు సామర్థ్యంతో కొత్త జలాశయాల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలాశయాలు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయంటున్నారు.