రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ స్పీడప్‌ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి రెండోరోజు బుధవారం విచారణకు హాజరయ్యారు. నిన్న బషీర్‌ బాగ్‌ లోని ఈడీ కార్యాలయంలో రేవంత్‌ రెడ్డిని విచారించిన అధికారులు. బుధవారం కూడా విచారణకు ఆదేశించడంతో ఈడీ ఎదుట హాజరయ్యారు.
మంగళవారం దాదాపుగా ఆరు గంటల పాటు ఈడీ.. రేవంత్‌ రెడ్డిని విచారించింది. విచారణలో భాగంగా.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ కు ఇవ్వచూపిన 50లక్షల గురించి, తర్వాత ఇస్తానని చెప్పిన 4.5 కోట్లు సమకూర్చుకునేందుకు గల ఆర్థిక వనరుల గురించి, ఆ డబ్బుతో ఆయకు ఉన్న సంబంధం గురించి.. వంటి తదితర ప్రశ్నలతో అధికారులు రేవంత్‌ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్‌ నేత వేం.నరేందర్‌ రెడ్డి, ఆయన కుమారుడు ఉదయ్‌ సింహలను అధికారులు విచారించారు. ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. వారి నుంచి సేకరించిన సమాచారం.. ఇతర పత్రాలను తమ వద్ద పెట్టుకుని.. వాటి ఆధారంగా రేవంత్‌ రెడ్డి నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం ఈడీ విచారణకు హాజరైన రేవంత్‌రెడ్డి తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్నాళ్లు సాగవని, తగిణ గుణపాఠం ఉంటుందన్నారు.