రెండోవిడతకు సర్వం సిద్దం

489 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు పల్లెలు సమాయత్తమయ్యాయి. జిల్లాలో రెండో విడతలో 489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిలో 123 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 366 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ.. కొన్ని చోట్ల రిజర్వు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు లేకపోవడంతో ఆయా పంచాయతీల్లోనూ ఎన్నికలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి, కుమురంభీం జిల్లాలోని వాంకిడి మండలంలోని తేజాపూర్‌, ఆసిఫాబాద్‌ మండలంలోని వెంకటాపూర్‌, రహపల్లిలో ఎన్నికలు ఆపేశారు. దీంతో గురువారం జరగనున్న రెండో విడత ఎన్నికల్లో 360 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. బోథ్‌ నియోజకవర్గంలో తెరాస తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలకు చెందిన మద్దతు దారులను ఎవరికి బరిలో దించారు. నిర్మల్‌, ముధోల్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు గెలిచి బలం చాటాలని సూచిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీలు అధికంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఓటర్లును భారీగా కొనుగోలు చేస్తున్నారు. జైపూర్‌, బీమారం, చెన్నూరు, కోటపల్లిలో డబ్బు, మద్యం పంపిణీ భారీగా సాగుతోంది. గ్రామాల్లో మద్య నిషేధం గురించి పట్టించుకోవడంలేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నారు. ఓటర్లు అడిగిన మద్యాన్ని(వివిధ రకాలు) సైతం ఇచ్చేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లో సుమారు పక్షం రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. ఎలాంటి పర్యవేక్షణ చర్యలు లేకపోవడం, వీటికి అడ్డుకట్ట వేయకపోవడంతో అనేక గ్రామాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్నాయి. కేవలం ఫిర్యాదు వస్తేనే తనిఖీలు చేపడుతున్నారనే వాదన వినిపిస్తోంది. చెన్నూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పంచాయతీల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.