రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు..


` ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌, కరోనా పరిస్థితులపై మంత్రి సవిూక్ష నిర్వహించారు. ‘‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయి రక్షణ లభిస్తుంది. రెండో డోసు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఇతర వేరియంట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27 వేల పడకలు ఉన్నాయి. ప్రజలు తమ వంతు బాధ్యతగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణను సాకారం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలల నమూనాలు, వాటి నిర్మాణ పనులపై సవిూక్షించారు. వరంగల్‌లో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్మాణాలు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే 4 టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 20 ఆస్పత్రులకు ప్రత్యేకంగా సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు హరీష్‌ రావు తెలిపారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్‌, నీలోఫర్‌ సహా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.